పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి రీపోలింగ్ కు ముందు అధికార తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
జరిగిన అసలు ఎన్నికల సమయంలో ఈవీఎంలపై బీజేపీ గుర్తు కనిపించకుండా నల్లటి స్టిక్కర్లు, టేపులు అతికించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన ఎన్నికల సంఘం నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికను రద్దు చేసి, మే 21న మళ్లీ పూర్తిస్థాయిలో పోలింగ్ నిర్వహించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
తీరా గురువారం ఓటింగ్ జరగాల్సి ఉండగా, ప్రచారానికి ఆఖరి రోజైన మంగళవారం నాడు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తాను ఈ ఎన్నికల బరిలో లేనని, తప్పుకుంటున్నానని ప్రకటించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్టా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని, అందుకే ఆ ప్రాంత ప్రయోజనాలు, శాంతిభద్రతలను కాంక్షించి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని జహంగీర్ ఖాన్ చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్ వైఖరి చాలా దూకుడుగా ఉండేది. ఎన్నికల విధులకు వచ్చిన పోలీస్ అధికారికి ఆయన తాను పుష్పను.. తగ్గేదే లే అంటూ సినిమా డైలాగులతో బహిరంగంగానే సవాల్ విసిరారు. తీరా ఇప్పుడు ఈవీఎంల అక్రమాలు బయటపడి, ఈసీ కఠినంగా వ్యవహరించి, సిట్యువేషన్ అంతా బీజేపీకి అనుకూలంగా మారేసరికి ఆ పుష్ప కాస్తా సైలెంట్ అయిపోయి సరెండర్ అయిపోయారు.

