మన దేశంలో ముస్లిం తరహాలో ఉన్న పేర్లు తీసేసి.. హిందూ పేర్లు పెడుతున్నాం. కానీ పాక్ మాత్రం రివర్స్ లో వెళ్తోంది. తమ ఊళ్లలో వీధులకు హిందూ పేర్లు పెడుతోంది.
79 ఏళ్ల తర్వాత లాహోర్ నగరంలో ఇస్లామిక్ పేర్లతో ఉన్న సైన్‌బోర్డులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. వాటి స్థానంలో విభజనకు పూర్వం ఉన్న హిందూ, సిక్కు, జైన్ సంస్కృతులను ప్రతిబింబించే పాత పేర్లు తిరిగి దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్, ప్రపంచ దేశాల ముందు తన కఠిన ఇస్లామిక్ దేశం అనే ముద్రను చెరిపేసి, ఒక ఉదారవాద, సహనశీల దేశంగా చూపించుకోవడానికి ఈ మార్పులు చేస్తోంది.
నాడు బాబ్రీ సెగ.. నేడు జైన్ మందిర్ చౌక్!
ఈ పేరు మార్పుల ప్రక్రియ గత రెండు నెలలుగా లాహోర్‌లో అత్యంత వేగంగా సాగుతోంది. ఇప్పటికే కనీసం తొమ్మిది ప్రధాన ప్రాంతాల పేర్లను ప్రభుత్వం అధికారికంగా మార్చేసింది. 1990లలో భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం పాక్‌లో తీవ్ర ఉద్రిక్తతలు వ్యక్తమైన తరుణంలో లాహోర్‌లోని ప్రసిద్ధ ' న్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీద్ చౌక్ గా మార్చారు. ఇప్పుడు దాన్ని మళ్లీ జైన్ మందిర్ చౌక్ గా పునరుద్ధరించారు. అలాగే ఇస్లాంపురా గా మారిన ప్రాంతం మళ్లీ కృష్ణ నగర్ అయింది. రహమాన్ గలీ మళ్లీ రామ్ గలీ గా, సున్నత్ నగర్ ప్రాంతం సంత్ నగర్ గా మారాయి. మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్ సైన్‌బోర్డు స్థానంలో మళ్లీ పాత లక్ష్మీ చౌక్ వెలిసింది.
5,000 కోట్ల మెగా హెరిటేజ్ ప్రాజెక్ట్
ఈ భారీ మార్పులన్నీ అనాలోచితంగా జరుగుతున్నవి కావు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో ఏర్పాటైన లాహోర్ అథారిటీ ఫర్ హెరిటేజ్ రివైవల్' ప్రాజెక్ట్‌లో ఇదొక కీలక భాగం. పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ నేతృత్వంలో సుమారు 50 బిలియన్ల పాకిస్తానీ రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అమల్లోకి తెచ్చారు. కేవలం వీధుల పేర్లు మార్చడమే కాకుండా.. పాత లాహోర్ గోడలను పునర్నిర్మించడం, చారిత్రాత్మక ఢిల్లీ గేట్, భాటి గేట్ వంటివి బాగు చేయడం, మహారాజా రంజిత్ సింగ్ కాలం నాటి సిక్కు కట్టడాలను, పాత చర్చిలను కూడా ఈ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్నారు.
ఆర్థిక గండం నుంచి గట్టెక్కేందుకేనా?
చరిత్రను చెరిపివేయడం వల్ల తాము సాంస్కృతికంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంత నష్టపోయామో పాక్ పాలకులు ఆలస్యంగా గ్రహించారు. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావాలన్నా, విదేశీ పెట్టుబడిదారులు దేశంలోకి అడుగుపెట్టాలన్నా పాకిస్తాన్ తనపై ఉన్న ఉగ్రవాద, తీవ్రవాద ముద్రను తొలగించుకోవాల్సిన కఠిన పరిస్థితి ఏర్పడింది. యూరప్ దేశాల తరహాలో హెరిటేజ్ టూరిజం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే పాక్ ప్రభుత్వ అసలు వ్యూహం. భారతదేశం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ, సిక్కు పర్యాటకులను ఆకర్షించడం ద్వారా కుప్పకూలుతున్న తమ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఊదాలని భావిస్తున్నారు.
తీవ్రవాద సంస్థల మౌనం
సాధారణంగా హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ అంటే పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ శక్తులు, కరడుగట్టిన తీవ్రవాద సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావాలి. కానీ, ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏ ఒక్క ఉగ్రవాద లేదా మత సంస్థ కూడా వ్యతిరేకించలేదు. అక్కడి ప్రజలు కూడా అనధికారికంగా దశాబ్దాలుగా ఈ పాత పేర్లనే వాడుతుండటంతో ప్రభుత్వ నిర్ణయానికి పెద్దగా అడ్డంకులు ఎదురుకాలేదు. లాహోర్‌లో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని త్వరలోనే సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసేందుకు పాక్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏది ఏమైనా, మతం పేరిట చరిత్రను మార్చలేమనే చేదు నిజాన్ని పాకిస్తాన్ పాలకుల తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.

