Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రియల్ డిమాండ్‌కు స్వగృహ స్థలాల వేలమే సాక్ష్యం!

రియల్ డిమాండ్‌కు స్వగృహ స్థలాల వేలమే సాక్ష్యం!

Telugu 360 5 days ago

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

ఫ్యూచర్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని, అన్ని వసతులతో కూడిన ప్లాట్లు కావడంతో కొనుగోలుదారులు పోటీ పడ్డారు. తొర్రూర్, కుర్మల్‌గూడ, బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని మొత్తం 85 ఓపెన్ ప్లాట్ల విక్రయం కోసం పెద్దఅంబర్‌పేటలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా, దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 83 కోట్ల మేర భారీ ఆదాయం సమకూరింది.

ఈ వేలంలో అన్నింటికంటే ముఖ్యంగా ఓఆర్ఆర్, ఆదిభట్ల ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్ లేఅవుట్‌లోని ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ కనిపించింది. ఇక్కడ 200 నుంచి 700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న 66 ప్లాట్లకు కనీస ధర రూ. 25 వేలుగా నిర్ణయించగా, బిడ్డర్లు పోటీపడి మరీ గరిష్టంగా చదరపు గజానికి రూ. 45,500 వరకు ధర పలికారు. సగటున ఇక్కడ గజం ధర రూ. 32,500 పలికింది. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకోవడం కోసం బిడ్డర్లు ఒక దశలో దాదాపు 20 సార్లకు పైగా రేట్లను పెంచుకుంటూ పోవడం ఇక్కడి రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు అద్దం పడుతోంది.

అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి లేఅవుట్‌లోని ప్లాట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక్కడ 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లకు కనీస ధర రూ. 27 వేలుగా నిర్ణయించగా, వేలం పాటలో గరిష్టంగా రూ. 40,500 ధర పలికింది. ఇక్కడి ప్లాట్లు సగటున గజానికి రూ. 33,800 చొప్పున అమ్ముడుపోయాయి. మరోవైపు ఎయిర్‌పోర్ట్, ఆర్‌సీఐ పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న కుర్మల్‌గూడలోని 11 ప్లాట్లకు కనీస ధర రూ. 20 వేలుగా నిర్ణయించగా, అక్కడ గరిష్టంగా చదరపు గజానికి రూ. 27,500 ధర లభించింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ వేలం ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా, నిబంధనల ప్రకారం సాగింది. ప్లాట్లను సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150 మందికి పైగా బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొని ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎంతో అధిక మొత్తాన్ని చెల్లించి ప్లాట్లను దక్కించుకున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని క్లియర్ టైటిల్ భూములు కావడం, భవిష్యత్తులో ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉండటమే ఈ స్థాయి భారీ స్పందనకు కారణమని రియల్ ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360