భారతదేశ నిర్మాణ రంగంలో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ పద్ధతుల్లో ఇల్లు కట్టాలంటే నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నుంచి, కేవలం కొన్ని రోజుల్లోనే పక్కా భవనాన్ని నిర్మించే స్థాయికి మనం చేరుకున్నాం.
ఇటుకలు, సిమెంట్ పూతలతో పనిలేకుండా, కంప్యూటర్ డిజైన్ ఆధారంగా కాంక్రీట్ పొరలను అమర్చుకుంటూ పోయే ఈ విధానం నిర్మాణ రంగంపై ఉన్న పాత అంచనాలను తలకిందులు చేస్తోంది. ఇది కేవలం ఒక ప్రయోగంలా కాకుండా, రియల్ ఎస్టేట్ ధరలను భారీగా తగ్గించగల ఒక ఆయుధంగా మారుతోంది.
ఈ సాంకేతికతలో ప్రధాన ప్రయోజనం సమయం, ఖర్చు. సాధారణంగా ఒక చిన్న ఇంటి నిర్మాణానికి కనీసం ఆరు నెలల సమయం పడితే, 3D ప్రింటింగ్ ద్వారా దానిని 5 నుండి 10 రోజుల్లోనే పూర్తి చేయవచ్చు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా, ముడి పదార్థాల వృథా దాదాపు సున్నాకి చేరుకుంటుంది. నిర్మాణ రంగంలో శ్రమశక్తి కొరత వేధిస్తున్న తరుణంలో, యంత్రాల ద్వారా జరిగే ఈ ప్రక్రియ బిల్డర్లకు, సామాన్యులకు పెను వెసులుబాటును కల్పిస్తోంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రభుత్వ , ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇటువంటి ఇళ్లు నిర్మితం అవుతున్నాయి.
డిజైన్ విషయంలో కూడా 3D ప్రింటింగ్ అపరిమితమైన స్వేచ్ఛను ఇస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో సాధ్యం కాని క్లిష్టమైన వంపులు (, ఆధునిక ఆర్కిటెక్చర్ డిజైన్లను ఈ యంత్రాలు సునాయాసంగా ప్రింట్ చేస్తాయి. ఇది ఇళ్లకు కొత్త అందాన్ని ఇవ్వడమే కాకుండా, భవనం దృఢత్వాన్ని కూడా పెంచుతుంది. భూకంపాలను తట్టుకునేలా, పర్యావరణ హితంగా ఈ ఇళ్లను రూపొందించవచ్చు. సామాన్యులకు సొంత ఇల్లు అన్న కలను సాకారం చేయడంలో ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రధాన భూమిక పోషించనుంది.
ప్రస్తుతం ఈ సాంకేతికత ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో ఇది ప్రధాన స్రవంతిలోకి వస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అందరికీ ఇల్లు వంటి పథకాలకు ఈ 3D ప్రింటింగ్ ఒక వరప్రసాదంలా మారనుంది. నిర్మాణ ఖర్చులు తగ్గితే, మధ్యతరగతి ప్రజలపై అప్పుల భారం తగ్గుతుంది. నిర్మాణ రంగంలో నిశబ్దంగా మొదలైన ఈ సాంకేతిక విప్లవం, రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

