Dailyhunt
రియల్ విన్నర్స్ కోసం చంద్రబాబు ఆత్మీయ విందు

రియల్ విన్నర్స్ కోసం చంద్రబాబు ఆత్మీయ విందు

Telugu 360 2 weeks ago

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టిస్తూనే, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఉత్సాహపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు.

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు లభించినందున , ఈ విజయంలో భాగస్వాములైన యంత్రాంగానికి గౌరవ సూచకగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు ' అధికార వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

రాష్ట్రానికి దక్కిన ప్రతిష్టాత్మక గౌరవానికి అసలైన కారకులు అధికారులేనని చాటుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ పేరిట ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, సీఎస్, డీజీపీ వంటి ఉన్నతాధికారులతో పాటు, గ్రామీణ స్థాయిలో అద్భుతమైన పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సమావేశం ప్రారంభంలో మంత్రులు, అధికారులు చప్పట్లతో సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఈ విజయం టీమ్ ఏపీ సమిష్టి కృషేనని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఈ పార్టీలో కేవలం సరదా కబుర్లే కాదు.. అమరావతి రాజధాని నిర్మాణం, మౌలిక వసతుల కల్పనలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కేవలం అంకెల్లోనే కాకుండా, జీవన ప్రమాణాల్లోనూ ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా నిబంధనలను మరింత సరళతరం చేయాలని, పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

విందు ముగిసే సమయానికి, ఉద్యోగులందరితో ఆత్మీయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఉద్యోగి పాత్ర కీలకమని గుర్తుచేశారు. సామాన్యుడి చెంతకు ప్రభుత్వ సేవలు వేగంగా చేరినప్పుడే అసలైన సంస్కరణలకు అర్థం ఉంటుందని వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని కఠిన లక్ష్యాలను చేరుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360