Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సజ్జల లేని వైసీపీ - ఊహించగలమా?

సజ్జల లేని వైసీపీ - ఊహించగలమా?

Telugu 360 2 weeks ago

వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్థానం, ఆయన ప్రాధాన్యతపై అంతర్గతంగానే కాకుండా బయట కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో జగన్ మోహన్ రెడ్డి తర్వాత సర్వాధికారాలు ఉన్న నెంబర్ వన్ నేత సజ్జలేనని మెజారిటీ నాయకులు, శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.

కీలకమైన రాజకీయ సమీక్షల నుంచి నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం వరకు ప్రతీ నిర్ణయంలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీ కోఆర్డినేటర్‌గా జగన్ ఇచ్చే ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ప్రజా నాయకుల కన్నా సజ్జలే పవర్ ఫుల్

పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్‌కు నమ్మకమైన ముఖ్య సహచరుడిగా సజ్జల నిలబడ్డారు. ఇతర సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణ, అయోధ్య రామిరెడ్డి, పెద్దిరెడ్డి వంటి అగ్రనేతలపై జగన్ లో క్రమంగా అపనమ్మకం సృష్టించేలా చేయడంలో సజ్జల సక్సెస్ అయ్యారని చెప్పుకుంటారు. అయితే సజ్జల స్థానం మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరలేదు. ఇతర సీనియర్లు పక్కకు తప్పుకున్నా , పరిమిత పాత్రలకే పరిమితమైనా, జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సజ్జల మాత్రమే పవర్‌ఫుల్ సెంటర్‌గా ఎదిగారు.

సజ్జల లేని వైసీపీని జగన్ నడపలేరు!

ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్‌సీపీకి ఒక ప్రధానమైన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా మారారు. జగన్ వరకు ఏ చిన్న విషయం వెళ్లాలన్నా, అధినేత మనసులో ఏముందో తెలుసుకోవాలన్నా పార్టీ శ్రేణులకు సజ్జల ఒక్కరే మార్గంగా కనిపిస్తున్నారు. పూజారి స్థానంలో ఉండి దేవుడికి, భక్తులకు మధ్య వారధిగా పనిచేస్తున్నట్లే.. జగన్‌కు, పార్టీ నేతలకు మధ్య సజ్జల ఒక బలమైన శక్తిగా స్థిరపడిపోయారు. ఒకవేళ సజ్జల కనుక ఈ వ్యవస్థలో లేకపోతే జగన్ నిర్వహణ తీరు ఎలా ఉంటుందనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో మెదులుతున్న పెద్ద ప్రశ్న. క్లిష్టమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలోను, మీడియా ద్వారా పార్టీ వైఖరిని బలంగా వినిపించడంలోను సజ్జల చూపే సమర్థతను భర్తీ చేయగల రెండో నేత ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలో లేరనేది బహిరంగ రహస్యమే.

సీనియర్ నేతలెవరూ లేరు!

జగన్‌కు అత్యంత విశ్వసనీయులుగా మిగిలిన అతి కొద్దిమందిలో సజ్జలే అగ్రభాగాన ఉండటంతో ఆయన లేని వైఎస్ఆర్‌సీపీ నిర్వహణను ఊహించడం కష్టమే. సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా కోఆర్డినేటర్ మాత్రమే కాదు. వైఎస్ఆర్‌సీపీ రోజువారీ రాజకీయాల్లో జగన్‌కు అత్యంత నిలకడైన రైట్ హ్యాండ్ గా మారిపోయారు. పార్టీలో అంతర్గత సమీకరణాలు ఎలా మారినా, ఇతర నాయకులు ఎంతమంది దూరమైనా జగన్ రాజకీయ వ్యూహాలు, ఆదేశాల అమలు అంతా సజ్జల చుట్టూనే తిరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సజ్జలే నెంబర్ వన్ అనుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360