హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్-202 పై జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. సుమారు 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్న ఈ సదస్సుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు.
అయితే, వేదికపై చర్చకు రానున్న అంశాలు, సదస్సు ఏర్పాట్లు, ఆహ్వానితుల జాబితాను గమనిస్తే ఇది పారిశ్రామిక పెట్టుబడుల సదస్సు కాదని, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించే కార్యక్రమమని ప్రతిపక్ష బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సదస్సు ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విదేశాంగ విధాన దృక్పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ విదేశాంగ విభాగం ఛైర్మన్ సల్మాన్ ఖుర్షీద్ స్వయంగా వెల్లడించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది.
మోదీతో అనుచితంగా ప్రవర్తించిన జర్నలిస్టుకు ఆహ్వానం కుట్రే !
ఈ అంతర్జాతీయ వేదికను కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సహా ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే క్రమంలో విదేశీ ప్రతినిధులను పిలిచి భారత అంతర్గత రాజకీయాలు, ఎన్నికల సమగ్రత వంటి అంశాలపై చర్చించడం దేశ ప్రతిష్టకు భంగం కలిగించే చర్య అని వారు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ నార్వే పర్యటనలో అవకాశం లేదని తెలిసినా ప్రశ్నలు వేసి సమాధానం ఇవ్వలేదని రచ్చ చేసిన నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్‌ను ఈ సదస్సుకు ప్యానెలిస్ట్‌గా ఆహ్వానించడం, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సూచనలతో ఆమె వీసా రద్దు కావడం వంటి పరిణామాలు సదస్సు ఉద్దేశాలపై మరిన్ని సందేహాలకు తావిచ్చాయి.
భారత్ వ్యతిరేక చర్చలు కాంగ్రెస్‌కే చేటు
విదేశీ వేదికలు లేదా అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో దేశ అంతర్గత వ్యవస్థలు, విదేశాంగ విధానాలపై జరిగే చర్చల విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బీజేపీని, ప్రధాని మోదీని రాజకీయంగా విమర్శించడంలో తప్పులేకపోయినా, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడినట్లుగాని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చర్చలు జరుగుతున్నట్లుగాని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం చేకూరుస్తుంది. సల్మాన్ ఖుర్షీద్, శామ్ పిట్రోడా వంటి నేతల వ్యాఖ్యలను బీజేపీ ఇప్పటికే దేశ వ్యతిరేక ఎజెండా గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.
ప్రజాధనంతో పెడుతున్న సదస్సు.. !
ఈ విమర్శలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు గట్టిగా తిప్పికొడుతున్నారు. గాంధీ అహింసా సిద్ధాంతం, నెహ్రూ అలీన విదేశాంగ విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వంటి ప్రగతిశీల భావజాలాలను ప్రపంచానికి పరిచయం చేయడమే భారత్ సమ్మిట్ ఉద్దేశమని, దావోస్ తరహాలో హైదరాబాద్‌ను సామాజిక, ఆర్థిక చర్చలకు వేదికగా మారుస్తున్నామని వారు సమర్థించుకుంటున్నారు. కారణాలు ఏవైనప్పటికీ, అంతర్జాతీయ అతిథుల సమక్షంలో జరిగే చర్చలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఉండాలి తప్ప, రాజకీయ విమర్శలకు ఆస్కారం ఇచ్చి సొంత పార్టీకే రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉండకూడదు. కాంగ్రెస్ పెద్దలు ఎంత మేర దీన్ని తెలుసుకుంటారో చూడాల్సి ఉంది.

