Dailyhunt
సంగారెడ్డి - గజ్వేల్  ..దీర్ఘకాల రియల్ పెట్టుబడికి మంచి మార్గం!

సంగారెడ్డి - గజ్వేల్ ..దీర్ఘకాల రియల్ పెట్టుబడికి మంచి మార్గం!

Telugu 360 3 weeks ago

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులు 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభమవనున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి - గజ్వేల్ సెక్షన్ మధ్య రియల్ ఎస్టేట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.

దాదాపు 160 కిలోమీటర్ల పొడవైన ఈ ఉత్తర భాగం పనుల కోసం భూసేకరణ దాదాపు 98 శాతం పూర్తవ్వడం, టెండర్ల ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ ప్రాంతంలో భూముల విలువలకు రెక్కలు వచ్చాయి.

సంగారెడ్డి నుంచి గజ్వేల్ వరకు ఉన్న ఈ సెక్షన్, హైదరాబాద్‌కు ఒక రెండో రక్షణ వలయంలా మారుతోంది. ఔటర్ రింగ్ రోడ్ కు సుమారు 30-50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం, నేరుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులను కలుపుతోంది. కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, ఈ కారిడార్ వెంబడి రీజినల్ రింగ్ రైల్ సర్వేకు కూడా కేంద్రం ఆమోదం తెలపడం ఇన్వెస్టర్లలో కొండంత భరోసాను నింపింది. ఫలితంగా, నిన్నటి వరకు వ్యవసాయ భూములుగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఇండస్ట్రియల్ మరియు రెసిడెన్షియల్ హబ్‌లుగా మారుతున్నాయి.

గతంలో ఎకరాకు రూ. 50 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పలికిన ధరలు, ఇప్పుడు రోడ్డు అలైన్‌మెంట్ , జంక్షన్ల సమీపంలో ఎకరాకు 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు చేరుకున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి మెగా ఇంటర్‌ఛేంజ్ , గజ్వేల్-ప్రజ్ఞాపూర్ జంక్షన్ల వద్ద డిమాండ్ విపరీతంగా ఉంది. నర్సాపూర్, తూప్రాన్ వంటి మధ్యంతర ప్రాంతాల్లో కూడా ఓపెన్ ప్లాట్ల ధరలు గజానికి రూ.15,000 నుంచి రూ.30,000 వరకు పలుకుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆశించే మధ్యతరగతి ఇన్వెస్టర్లు ఇప్పుడు సంగారెడ్డి-గజ్వేల్ బెల్ట్‌ను తమ ప్రథమ ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు.

ప్రభుత్వం ఈ RRR సెక్షన్ వెంబడి కొత్త శాటిలైట్ టౌన్‌షిప్‌లు ,లాజిస్టిక్ పార్కులను ప్రతిపాదించడంతో, నిర్మాణ రంగ సంస్థలు ఇక్కడ భారీ గేటెడ్ కమ్యూనిటీలను ప్లాన్ చేస్తున్నాయి. సంగారెడ్డిలోని ఇండస్ట్రియల్ హబ్ మరియు గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్‌లను ఈ రోడ్డు కలపడం వల్ల, ఈ రెండు పట్టణాల మధ్య కొత్త నగరం వెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఆర్ఆర్ఆర్ నిర్మాణం పూర్తయి వాహనాల రాకపోకలు మొదలయ్యే 2027-28 నాటికి ఇక్కడి ధరలు మరో 50 శాతం పెరిగే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360