Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సతీశన్ ఎంపిక రేవంత్‌కు షాకా.. ఎలా?

సతీశన్ ఎంపిక రేవంత్‌కు షాకా.. ఎలా?

Telugu 360 6 days ago

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘనవిజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్‌ను అధిష్ఠానం ఖరారు చేసింది. ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.

అయితే, ఈ పరిణామాన్ని కొందరు రేవంత్ రెడ్డికి తగిలిన షాక్ గా ప్రచారంచేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ మద్దతిచ్చిన వేణుగోపాల్ ను సీఎంగా ఎంపిక చేయలేదట.

వేణుగోపాల్‌కు రేవంత్ సిఫారసు అవసరమా?

కేరళ సీఎం రేసులో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు రేవంత్ మద్దతుగా నిలిచారని, తీరా చూస్తే సతీశన్ సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దల వద్ద పలుకుబడి తగ్గిపోయిందంటూ సాగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది. నిజానికి, కేసీ వేణుగోపాల్ వంటి జాతీయ స్థాయి నేతకు ఎవరి మద్దతో అవసరం లేదు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అత్యంత ఆప్తుడిగా, 24 గంటలూ వారితోనే ఉండే వేణుగోపాల్‌కు సీఎం పదవి ఇవ్వాలా వద్దా అనేది అధిష్ఠానం నేరుగా నిర్ణయించగలదు. ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర గానీ, ఆయన సిఫార్సు గానీ ఉండే అవకాశం అస్సలు లేదు.

ప్రాంతీయ సమీకరణాలతోనే సతీశన్‌కు పదవి

కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కీలక పదవిలో ఉన్నందున, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆయనతో సత్సంబంధాలు కొనసాగించడం సహజం. అంతేకాని, కేరళ అంతర్గత రాజకీయాల్లో రేవంత్ జోక్యం చేసుకున్నారని అనుకోవడం కేవలం ఊహాజనితమే అవుతుంది. వి.డి. సతీశన్ గత ఐదేళ్లుగా కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక ఎమ్మెల్యేల మద్దతు, కూటమిలోని ముస్లిం లీగ్ వంటి భాగస్వామ్య పక్షాల అండదండలు సతీశన్‌కే ఎక్కువగా ఉన్నాయి. కేరళలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి నడిపించిన నేత కాబట్టే ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఈ ప్రాంతీయ సమీకరణాలను పక్కనపెట్టి, ఎక్కడో కేరళకు పరిమితమైన ఒక నాయకుడి ఎంపికను, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్‌తో ముడిపెట్టడం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం.

ఏం జరిగినా రేవంత్‌కు షాక్ అంటే ఎలా?

ఏం జరిగినా రేవంత్ రెడ్డికి షాక్ అని ప్రచారం చేసుకోవడంలో వింతేమీ లేదు. చెప్పుకోవడానికి వేరే బలమైన అంశాలు లేనప్పుడు, ఇలాంటి అంతర్రాష్ట్ర రాజకీయ పరిణామాలను కూడా తమకు అనుకూలంగా మలుచుకుని సంతోషపడటం వారి వ్యూహంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ వద్ద ఉన్న పట్టును ఇలాంటి చిన్న విషయాలు ఏమాత్రం ప్రభావితం చేయలేవని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360