తోడబుట్టిన చెల్లెలి కుటుంబంపై, రక్తసంబంధీకులపై కక్ష సాధింపు ఏ స్థాయికి దిగజారవచ్చో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి మరోసారి రుజువు చేసింది.
తన కోసం అప్పట్లో కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కుమార్తె , మేనకోడలు అంజలి రెడ్డి వివాహానికి సైతం కనీస కనికరం లేకుండా అడ్డం పడటం విస్మయం కలిగిస్తోంది. నవంబర్ 25న జరగాల్సిన మేనకోడలి పెళ్లిని బెంగళూరులోని యలహంక నివాసంలో జరిపించేందుకు అనుమతించకుండా జగన్ అడ్డుపడటమే కాకుండా, తానేదో బాధితుడిలా రక్షణ సాకులతో చెల్లెలికి లేఖ రాసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.
షర్మిలకు జగన్ లేఖ అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం
పైకి అంజలి పెళ్లి సంతోషం కలిగించింది, ఆమె నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ తీపి మాటలు పలికిన జగన్.. అసలు విషయానికి వచ్చేసరికి మాత్రం భద్రత, వ్యక్తిగత గోప్యత అనే నిరాధారమైన సాకులను తెరపైకి తెచ్చి నివాసంలో వేడుకకు ససేమిరా అన్నారు. పెళ్లి జరిగితే క్యాటరింగ్ వాళ్లు, పూల డెకరేషన్ చేసేవాళ్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫొటోగ్రాఫర్లు, అపరిచితులు వస్తారని, వారి రాకతో తన నివాస ప్రాంగణ దృశ్యాలు బయటకు వెళ్లి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని లేఖలో పేర్కొన్నారు. ప్రెస్‌మీట్‌లో పేర్ని నాని కూడా అదే చెప్పారు. తన సొంత కుమార్తెలు హర్ష, వర్ష పెళ్లిళ్లయినా ఇదే నిర్ణయం తీసుకునేవాడినని చెప్పుకొచ్చారు.
షర్మిల ఆస్తిలో జగన్ పెత్తనమేంటి?
రాజశేఖర రెడ్డి జీవించి ఉన్న కాలంలో ఉమ్మడి కుటుంబ ఆస్తిగా నిర్మితమై, విజయమ్మతో పాటు పిల్లలందరి వాటాల భాగస్వామ్యం ఉన్న బెంగళూరు నివాసాన్ని కేవలం తన సొంత జాగీరులా జగన్ భావిస్తున్నారన్నది ఈ లేఖతో సుస్పష్టమైంది. తన తల్లి విజయమ్మ స్వయంగా జోక్యం చేసుకుని, మనవరాలి పెళ్లిని బెంగళూరులోనే జరిపించాలని కోరినప్పటికీ.. ఆమె మాటను కూడా ఖాతరు చేయకుండా మధ్యవర్తుల ద్వారా హెచ్చరికలు పంపడం జగన్ కఠిన వైఖరికి పరాకాష్ట. ఇప్పటికే బంధుమిత్రులు, జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులకు బెంగళూరు వేదికగా ఆహ్వాన పత్రికలు కూడా అందించిన తరుణంలో.. చివరి నిమిషంలో అక్కడికి రావడానికి వీల్లేదని లేఖ రాయడం ద్వారా చెల్లెలిని బంధువర్గంలో, ప్రజల ముందూ తలదించుకునేలా చేయాలన్న దురుద్దేశం తప్ప ఇందులో మరేమీ కనిపించడం లేదు.
కన్వెన్షన్ సెంటర్ వాడుకోవాలని సలహా
పెళ్లి వేదికగా బెంగళూరు నివాసాన్ని నిరాకరిస్తూనే.. రాజా పెళ్లికి చేసినట్లు బయట కన్వెన్షన్ హాల్లోనో, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికల్లోనో చేసుకోండి.. లేదంటే హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ ఇల్లు వాడుకోండి అంటూ ఉపదేశాలు ఇవ్వడం షర్మిలను మరింత కించపరచడమే . ఆస్తుల వివాదంలో తల్లిని, చెల్లెలిని ఇప్పటికే రోడ్డుకీడ్చి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వరకు వెళ్లిన జగన్.. ఇప్పుడు మేనకోడలి శుభకార్యం విషయంలో అడ్డం పడటం అమానవీయమన్న భావన వ్యక్తమవుతోంది. నివాసంలో జరుగుతున్నది రక్తసంబంధీకుల పెళ్లి వేడుక అనే ఇంగితాన్ని మరిచి, కేవలం అహంకారంతో సొంత చెల్లెలిని, కన్నతల్లిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్న తీరు వైఎస్ కుటుంబ అభిమానుల్లో సైతం అసంతృప్తిని రాజేస్తోంది.

