వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏ వికెట్ పడుతుందో, ఎవరి గొంతుక మూగబోతుందో తెలియని గందరగోళం నడుస్తోంది. తాజాగా పార్టీ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ యాంకర్ శ్యామలను వైసీపీ పెద్దలు పక్కన పెట్టేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట పడటంలేదు.
ఈ పుకార్లపై శ్యామల స్పందిస్తూ.. నన్ను సైలెంట్ చేయాలనుకునే ప్రతి ప్రయత్నం నా గళాన్ని ఇంకా గట్టిగా మారుస్తుంది, ఇది నా కౌంట్‌డౌన్ కాదు.. నా పోరాటానికి స్టార్ట్ అంటూ గంభీరమైన డైలాగులు అయితే వదిలారు. కానీ, ఆమె ఎంతగా ఖండించినా.. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న సైలెన్స్ మాత్రం కథ అడ్డం తిరిగిందనే నిజాన్నే చాటిచెబుతోంది.
గత పది నెలలుగా శ్యామలకు పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున ఒక్కటంటే ఒక్క ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆమె చేసిన ట్వీట్ అబద్ధం అని నిరూపించడానికైనా తాడేపల్లి పెద్దలు ఆమెతో ఒక అధికారిక ప్రెస్‌మీట్ పెట్టించి ఉంటే బాగుండేది, కానీ అలాంటి ఛాన్స్ అస్సలు ఇవ్వడం లేదు. గతంలో ఎన్నికల ప్రచారంలోనూ, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికలపై వైసీపీ వాయిస్‌ను గట్టిగా వినిపించిన ఈ స్టార్ యాంకర్, ఇప్పుడు పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా డిజిటల్ ఫ్రేమ్‌లో కూడా కనిపించడం లేదు. అంటే, ముఖానికి మేకప్ తీసేసి స్క్రిప్ట్ మార్చేసినట్లుగా.. ఆమెను నిజంగానే లూప్‌లోంచి తప్పించారనేది స్పష్టమవుతోంది.
ఇంతకీ శ్యామల అంతలా పార్టీ పెద్దలను ఏం అసంతృప్తికి గురిచేశారబ్బా అనే ప్రశ్నలపై సోషల్ మీడియాలో రకరకాల సెటైర్లు పేలుతున్నాయి. బహుశా ప్రెస్‌మీట్లలో జగన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను యాంకరింగ్ స్టైల్‌లో కాకుండా, సొంతంగా సొగసైన పంచ్‌లు వేయడానికి ప్రయత్నించారా లేక తానే కాబోయే హోంమంత్రినని చెప్పుకున్న విషయం తెలిసిపోయిందా అని చర్చించుకుంటున్నారు. పార్టీ నుంచి ఆమెను అవుట్ చేశారని వస్తున్న గాసిప్స్‌కు చెక్ పెట్టాలంటే.. కేవలం సోషల్ మీడియా ట్వీట్లు సరిపోవు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు వచ్చి, మైక్ ముందుకు తెచ్చి, మైండ్ మార్చేలా ప్రెస్‌మీట్ పెట్టిస్తేనే శ్యామల పొలిటికల్ కెరీర్ సేఫ్‌గా ఉన్నట్లు. అలాంటి అవకాశం దొరుకుతుందో లేదో మరి

