వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతల ప్రాధాన్యతలు, ప్రాతినిధ్యంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వేళ మీడియా వేదికలపై, సామాజిక మాధ్యమాల్లో ఫైర్‌బ్రాండ్ వాయిస్‌గా నిలిచిన ప్రముఖ యాంకర్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలకు మెల్లమెల్లగా ప్రాధాన్యత తగ్గుతోంది.
ఆ మధ్య చాలా కాలం పాటు అసలు పార్టీ ఆఫీసుకే రానివ్వలేదు. ఇప్పుడు ఇతరులకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
దీనికి భిన్నంగా, గతంలో బీజేపీ నుంచి వైసీపీలోకి వచ్చి అంతగా గుర్తింపు లేని మంచా నాగమల్లేశ్వరి వంటి నేతలను ప్రోత్సహిస్తూ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే నాగమల్లేశ్వరి చేసే విమర్శలు లేదా ప్రెస్ మీట్లను ప్రధాన మీడియాగానీ, ఆఖరికి వైసీపీ సొంత సోషల్ మీడియా యంత్రాంగం కానీ పెద్దగా హైలైట్ చేయడం లేదు. విస్తృత ప్రచారం, గళం వినిపించే సామర్థ్యం ఉన్న శ్యామలను పక్కనపెట్టి, ఇంకొకరిని ముందుకు తీసుకురావడం వెనుక పార్టీలోని అంతర్గత కోటరీ వ్యూహాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
పార్టీలో శ్యామలకు గల గుర్తింపు, ఆమెకున్న పాపులారిటీని క్రమంగా తగ్గించేలా 'ృపొమ్మనకుండా పొగబెట్టే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ఈ పరిణామాలపై గతంలోనే సామాజిక మాధ్యమాల్లో నెగెటివ్ వార్తలు వచ్చినా, తాను పదవుల కోసం రాలేదని, జగన్ నమ్మకమే తన బలమని శ్యామల వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పరిణామాలు, ప్రెస్ మీట్ల కేటాయింపులు చూస్తుంటే ఆమెను క్రమంగా మూలన పడేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది స్పష్టమవుతోంది.
ప్రజాదరణ, మాట్లాడే నేర్పరితనం ఉన్న శ్యామల లాంటి నేతలను సంక్షోభ సమయంలో సరిగ్గా వాడుకోకుండా నిశ్శబ్దం చేయడం వల్ల పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్లడం లేదని క్యాడర్ వాపోతోంది. ఈ పరిస్థితి తెలిసినా శ్యామల ఏమీ చేయలేని స్థితిలో ఉండటం, వైసీపీ మహిళా నేతల అంతర్గత పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది.

