Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎం అయిపోవచ్చు కదా.. ఎందుకీ గోల!?

సీఎం అయిపోవచ్చు కదా.. ఎందుకీ గోల!?

Telugu 360 2 weeks ago

నేను సీఎం కాకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు.. సమయం వచ్చినప్పుడు అది తీరుతుంది అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు.

ఎందుకంటే ఆయనను రాజగో..పాల్ అనుకుంటున్నారు తెలంగాణ నేతలు. ఒక వైపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతానని కొండంత ధీమా వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి, మరోవైపు ప్రస్తుతం ఒక మంత్రి పదవి కోసం పాకులాడుతున్నారు. బతిమాలుతున్నారు.. బెదిరిస్తున్నారు. అన్నీ చేస్తున్నారు.

పదవి కోసం పరితపిస్తున్న రాజగోపాల్ రెడ్డి

నిజానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కేవలం భావోద్వేగపూరితమైనవి కావు, అవి కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వత్తిడి తెచ్చే ఒక వ్యూహాత్మక పావు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను విడిచి బిజెపిలోకి వెళ్లడం, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యేగా గెలవడం వరకూ ఆయన రాజకీయం అంతా పదవులు, ప్రాధాన్యతల చుట్టూనే తిరిగింది. ఇప్పుడు సీఎం పోస్ట్ తన లక్ష్యమని పెద్ద మాటలు చెబుతూనే, కేబినెట్ విస్తరణలో బెర్త్ సాధించేందుకు ఆయన పడుతున్న ఆరాటం ఆయన రాజకీయ శైలిని ప్రతిబింబిస్తోంది.

రేవంత్‌ను బెదిరిద్దామనే!

సీఎం రేంజ్ కెపాసిటీ, ప్రజాదరణ నిజంగానే తన వద్ద ఉన్నాయని నమ్మితే.. ప్రతీసారి పార్టీపై, అధిష్టానంపై ఒత్తిడి తెస్తూ పదవుల కోసం ఆశపడటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొంత బలంపై నమ్మకముంటే ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా సొంత బాట వేసుకోవచ్చు లేదా ప్రాంతీయ శక్తిగా ఎదగవచ్చు. కానీ, కాంగ్రెస్‌లోనే ఉంటూ ఒకవైపు మంత్రి పదవి రాకపోతే అలకపూనడం, మరోవైపు నన్ను బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అని విమర్శలు గుప్పించడం కేవలం తన రాజకీయ ఉనికిని, డిమాండ్‌ను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంగానే కనిపిస్తోంది.

అడ్డుకుంటే ఆగడం ఎందుకు రాజగో.పాల్

ఈ వ్యవహారంలో ఆయనను సీఎం కాకుండా ఎవరో అడ్డుకుంటున్నారనే కంటే, ఆయన తొందరపాటే . సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇవ్వడం సామాజిక సమీకరణాల పరంగా హైకమాండ్‌కు మింగుడుపడని అంశం. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కకపోవడానికే పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ఈ తరహా వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పెంచుతున్నారని ప్రచారం జరుగుతోంది. తనకు పదవి వస్తే ప్రజలకే వచ్చినట్లని చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి, ఒక స్థిరమైన నిర్ణయానికి రావలసిన అవసరం ఉంది. సొంత పార్టీ పెట్టుకుని తన కెపాసిటీ చూపించాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360