Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంగానే అసెంబ్లీకి - ఎమోషన్ లేని కేసీఆర్ పాలిటిక్స్ !

సీఎంగానే అసెంబ్లీకి - ఎమోషన్ లేని కేసీఆర్ పాలిటిక్స్ !

Telugu 360 2 weeks ago

సీఎంగానే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ ప్రకటించారు. అంటే ఆయన ఇక అసెంబ్లీకి రారని తేల్చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఎందుకు ఇంత అహంకారం అన్న ప్రశ్న వస్తోంది. రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయాలు కొత్త కాదు కానీ.. పూర్తిగా ప్రజల్ని తక్కువ చేసే ఇలాంటి నిర్ణయం మాత్రం కొత్త. గతంలో ఇలాంటి సవాళ్లు చేసిన వాళ్లు చాలా పక్కాగా చేశారు.

అంతా ప్రజా కోణంలోనే చేశారు!

రాజకీయాల్లో శపథాలు, ప్రతీకారాలు, సవాళ్లు కేవలం వ్యక్తిగత పంతాలు మాత్రమే కావు. అవి ప్రజలలో ఒక బలమైన భావోద్వేగాన్ని , సానుభూతిని రగిల్చే శక్తివంతమైన ఆయుధాలు. భారత రాజకీయ చరిత్రను ఒక్కసారి తిరగేస్తే.. తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొని ముఖ్యమంత్రినయ్యాకే సభలో అడుగుపెడతాను అని ప్రతీజ్ఞ చేసి గెలిచిన జయలలిత, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో జరిగిన పరాభవాన్ని తట్టుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తిరిగి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్, ఇటీవలే వ్యక్తిగత విమర్శలతో నొచ్చుకుని సభ వీడి, అఖండ మెజారిటీతో మళ్లీ సీఎం పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు మనకు కనిపిస్తారు. వీరందరి శపథాల వెనుక ఒక తీవ్రమైన అవమానం, పోరాటం, ప్రజాదరణ సాధించాలనే బలమైన ఆరాటం ఉన్నాయి.

కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లరు?

కానీ, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకపోవడానికి కారణం అలాంటిది కాదు. ఆ నాయకుల వ్యూహాలకు, ఇప్పటి కేసీఆర్ వైఖరికి చాలా తేడా కనిపిస్తోంది. అసెంబ్లీ సభలో కేసీఆర్‌ను ఎవరూ ప్రత్యక్షంగా అవమానించలేదు, సభ నుండి పంపించివేయలేదు. అలాంటి అవకాశం కూడా ఆయన ఇవ్వలేదు. సభకు రాలేదు. కేసీఆర్ సభకు వస్తే ఆయన గౌరవం తగ్గకుండా చూస్తానని రేవంత్ హామీ కూడా ఇచ్చారు. అయినా మనసు మార్చుకోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే, సభకు రాకుండా మళ్లీ సీఎం అయ్యాకే వస్తాను అని వించడం ఏ రకమైన రాజకీయ వ్యూహమో ప్రజలకు అర్థం కావడం లేదు.

ప్రజల్లో కూడా ఉండటం లేదే !

చరిత్ర సృష్టించిన నాయకులు తమకు జరిగిన అవమానాలను లేదా ఓటములను ప్రజల్లోకి తీసుకెళ్లి, రోజువారీ పోరాటాలతో ప్రజాదరణను తిరిగి పునాదిగా మలచుకున్నారు. చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కానీ శాసనసభకు దూరంగా ఉన్న సమయంలో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. కానీ, కేసీఆర్ ఓటమి అనంతరం అత్యధిక సమయం ఫామ్ హౌస్‌కే పరిమితమవ్వడం, ప్రజాక్షేత్రంలో చురుగ్గా కనిపించకపోవడం వల్ల ప్రజలు కూడా భావోద్వేగానికి గురయ్యే చాన్స్ లేదు. సీఎం పదవి లభిస్తేనే సభకు వస్తాననడం ప్రజల్లో సానుభూతిని కలిగించకపోగా, బాధ్యతారాహిత్యమనే భావనను పంపే ప్రమాదం ఉంది.

ప్రజలిచ్చిన తీర్పును గౌరవించామే ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది తక్కువదేమీ కాదు. ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా గళమెత్తడమే ప్రతిపక్ష నాయకుడికి అసలైన గౌరవం , బలం. సభకు రాకుండా ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటూ, రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారం వస్తుందని ఆశించడం చోద్యంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాదరణ అనేది ఇంట్లో కూర్చుంటే వచ్చేది కాదు, సభ లోపల , బయట ప్రజల తరఫున నిలబడి పోరాడితేనే లభించేది. ఈ విషయాన్ని గ్రహించకుండా కేవలం అధికారం వచ్చాకే అసెంబ్లీకి వస్తా అని పట్టుబట్టడం రాజకీయంగా కేసీఆర్‌కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360