Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SIRపై నెగెటివ్ ప్రచారం - జగన్‌ది పెద్ద ప్లానే?

SIRపై నెగెటివ్ ప్రచారం - జగన్‌ది పెద్ద ప్లానే?

Telugu 360 3 weeks ago

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి వరకు కేంద్రంతో స్నేహపూర్వక వైఖరిని ప్రదర్శించారు. ఇప్పుడు తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఆయన వక్రీకరించడం ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

బెంగాల్ లో బీజేపీ గెలుపునకు ఈ ప్రక్రియే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖ వైఫల్యాలుగా చిత్రించేలా ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, బీజేపీతో ఇక ముందు బంధం ఉండబోదనే స్పష్టమైన సంకేతంగా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు.

నరేటివ్ మార్పు - పెట్రోల్ నుంచి ఎస్ఐఆర్ వరకు

గత కొద్ది రోజులుగా జగన్ అనుసరిస్తున్న విధానాలు ఒక పక్కా యాంటీ-బీజేపీ నరేటివ్‌ను నిర్మిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైసీపీ చేసిన నిరసనలు.. పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల మీద దాడి చేయడమే. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ కుట్ర గా అభివర్ణించడం ద్వారా, జాతీయ స్థాయిలో ఎన్డీయే వ్యతిరేక కూటమి కి తాను చేరువవుతున్నట్లు ఆయన హింట్‌ ఇచ్చారు. ఈ యూ-టర్న్ వెనుక ఉన్న అసలు కారణం.. ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉండటమేనని, ఇక బీజేపీతో దోస్తీ వల్ల తనకు ఒరిగేదేమీ లేదని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో రహస్య రాయబారాలు?

రాజకీయ వర్గాల్లో మరో ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే.. జగన్ మోహన్ రెడ్డి మెల్లగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారన్నది. జాతీయ స్థాయి నేతలతో ఆయన రహస్య చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ పార్టీ రాకతో మారుతున్న సమీకరణాలతో , దక్షిణ భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రాంతీయ శక్తుల ఐక్యత కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎన్డీయేను ఢీకొట్టడానికి కాంగ్రెస్ అండ అవసరమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి కావడంతో జగన్‌కు ధైర్యం వచ్చిందని చెబుతున్నారు.

ఢిల్లీ పెద్దల అసలు గేమ్ ప్రారంభం?

జగన్ ముసుగు తొలగిపోయిందని, ఆయన తన అసలు రంగును బయటపెట్టారని బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటివరకు జగన్‌పై ఉన్న సాఫ్ట్ కార్నర్ ఇక ముందు ఉండబోదని అంటున్నారు. జగన్ ఎప్పుడైతే బీజేపీని బ్లేమ్ చేయడం ప్రారంభించారో అప్పుడే అసలు కథ ప్రారంభమైందని అంటున్నారు. రాష్ట్రంలో కోల్పోయిన కేడర్ నైతిక స్థైర్యాన్ని పెంచడానికి బీజేపీని విలన్‌గా చూపించడం, ఇటు జాతీయ స్థాయిలో తన రక్షణ కోసం ఇండియా బ్లాక్ మద్దతు కూడగట్టడం.. ఇవీ జగన్ ప్రస్తుత వ్యూహాలు. అయితే, ఈ డబుల్ గేమ్ ఎంతవరకు పారుతుంది? ఢిల్లీ పెద్దలు ఆయన వ్యూహాన్ని ఎలా చిత్తు చేస్తారు? అన్నది ముందు ముందు జరిగే పరిణామాలతో స్పష్టమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360