Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సోమాజిగూడలో హైరైజ్ అపార్టుమెంట్‌ సీజ్

సోమాజిగూడలో హైరైజ్ అపార్టుమెంట్‌ సీజ్

Telugu 360 3 months ago

హైదరాబాద్ నగరంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉక్కుపాదం మోపింది. సోమాజిగూడ రాజ్‌భవన్‌ రోడ్డులో పార్క్ హోటల్ సమీపంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన ఒక భారీ మల్టీ-స్టోరీడ్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారు.

నిబంధనలను ఉల్లంఘించి, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ 17 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించినట్లు తేలడంతో.. సదరు బిల్డింగ్ పర్మిషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ కార్పొరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

బద్వేలు ప్రదీప్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్‌ వ్యాపారికి చెందిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఇక్కడ రెండు భారీ టవర్లతో కూడిన గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మించింది. అయితే, ఈ భవనాన్ని నిర్మించిన భూమి తీవ్ర వివాదాస్పదంగా ఉండటంతో పాటు, అనుమతుల ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. వాస్తవాలను పూర్తిగా మరుగున పెట్టి, తప్పుడు సమాచారంతో ఈ ప్లాన్ అప్రూవల్స్ పొందినట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 450 కింద నిర్మాణ సంస్థకు అధికారులు ఈ నోటీసులు పంపారు.

ఈ అక్రమ భవన నిర్మాణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత సదరు సంస్థ దరఖాస్తు చేసుకున్న ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీని అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటీసులపై జరుగుతున్న విచారణా ప్రక్రియ ముగిసే వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ భవనానికి ఎలాంటి లీగల్ అప్రూవల్స్ లేవని, ఇప్పటివరకు దీనికి ఎలాంటి ఓసీ జారీ చేయలేదని జీహెచ్ఎంసీ అధికారికంగా వెల్లడించింది.

సోమాజిగూడ లాంటి ప్రైమ్ లొకేషన్‌లో కోట్లాది రూపాయల విలువైన 17 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ రద్దు దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేయడం రియల్ ఎస్టేట్ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నోటీసులపై బిల్డర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, నిబంధనల ఉల్లంఘన పూర్తిగా రుజువైతే ఈ అక్రమ కట్టడంపై భారీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని మున్సిపల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360