రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకు వ్యూహకర్తలు ఇచ్చే డేటా కంటే, గ్రహగతులు మార్చే జ్యోతిష్యుల పైనే రాజకీయ నేతలు ఎక్కువ నమ్మకం పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఇటీవల తమిళనాడులో విజయ్ విజయం వెనుక జ్యోతిష్యుడి హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో, ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. చండీగఢ్‌కు చెందిన ప్రముఖ ఆస్ట్రాలజర్ రుద్ర కరణ్ ప్రతాప్ ప్రత్యేకంగా తాడేపల్లికి వచ్చి జగన్‌తో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తాడేపల్లికి చండీగఢ్ జ్యోతిష్యుడు
గత ఎన్నికల్లో ఐప్యాక్ వంటి వ్యూహకర్తలను నమ్ముకున్న జగన్, ఈసారి మాత్రం గ్రహబలంపైనే భారం వేసినట్లు కనిపిస్తోంది. చండీగఢ్ నుంచి రుద్ర కరణ్ ప్రతాప్‌ను ప్రత్యేకంగా తాడేపల్లికి రప్పించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. రాజకీయ నాయకుల అవసరాలకు అనుగుణంగా జ్యోతిష్యం చెప్పడంలో రుద్ర కరణ్ సిద్ధహస్తుడని పేరుంది. తన పర్యటనకు సంబంధించిన వివరాలను సదరు జ్యోతిష్యుడు సోషల్ మీడియాలో స్వయంగా పంచుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
2024 అంచనాలు ఫలించకపోయినా.. మళ్ళీ ఆయనకే ప్రాధాన్యత!
నిజానికి, 2024 ఎన్నికల్లో జగన్ ఘనవిజయం సాధిస్తారని రుద్ర కరణ్ ప్రతాప్ గతంలోనే జోస్యం చెప్పారు. అయితే ఆ అంచనాలు క్షేత్రస్థాయిలో తలకిందులయ్యాయి. అయినప్పటికీ, జగన్ ఆయనపై నమ్మకం కోల్పోకుండా మళ్ళీ పిలిపించి చర్చలు జరపడం గమనార్హం. కేవలం రాజకీయ భవిష్యత్తే కాకుండా, ప్రస్తుతం ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, వ్యక్తిగత జాతక దోషాల నివారణ కోసం కూడా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. స్ట్రాటజిస్టులు ఇచ్చే లెక్కలు ఒక్కోసారి తప్పవచ్చు కానీ, సరైన జ్యోతిష్యుడి సాయంతో గ్రహాలను అనుకూలం చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
విజయ్ ఎఫెక్ట్.. జగన్ రియాక్షన్
తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారంలోకి రావడానికి ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు ఇచ్చిన సలహాలే కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విజయ్ ఫార్ములా ను చూశాక, జగన్ కూడా పొలిటికల్ స్ట్రాటజిస్టుల కంటే ఆస్ట్రాలజిస్టులే బెటర్ అనే ముగింపుకు వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే తాడేపల్లి ప్యాలెస్‌లో ఇప్పుడు పొలిటికల్ డేటా కంటే, జాతక చక్రాలు, గ్రహాల సంచారంపైనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. జ్యోతిష్యుడి సలహాలు జగన్ జాతకాన్ని ఎంతవరకు మారుస్తాయో వేచి చూడాలి.

