Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్త్రీ శక్తి  థీమ్‌తో  టీడీపీ మహానాడు

స్త్రీ శక్తి థీమ్‌తో టీడీపీ మహానాడు

Telugu 360 2 days ago

తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని నిర్ణయించారు. హైబ్రీడ్ పద్దతిలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జరగనున్న ఈ వేడుకలపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం వర్చువల్‌గా పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది.

ఈ భేటీలో మహానాడు అజెండాతో పాటు మహిళా చైతన్యాన్ని చాటేలా ప్రవేశపెట్టబోయే తీర్మానాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఆస్తి హక్కు నుంచి రాజకీయ ప్రాతినిధ్యం వరకు టీడీపీ మార్కు చరిత్ర

మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మక పునాదులు వేసింది. నాడు నందమూరి తారకరామారావు హయాంలో మహిళలకు కల్పించిన ఆస్తి హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్లు దేశ రాజకీయాల్లోనే ఒక విప్లవాత్మక మార్పుకు కారణమయ్యాయి. మహానాడు వేదికపై జరిగే ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, రాజకీయ చర్చలు.. టీడీపీ గత నలభై ఏళ్లలో మహిళా లోకానికి చేకూర్చిన లబ్ధిని, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించిన తీరును కళ్లకు కట్టేలా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.

మహాశక్తి సంక్షేమ పథకాలపై ప్రత్యేక నజర్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మహిళల భాగస్వామ్యాన్ని, వారికి అందుతున్న లబ్ధిని ఈ మహానాడులో ప్రధానంగా హైలైట్ చేయనున్నారు. ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, తల్లికి వందనం, మరియు మహిళా భద్రత కోసం హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో తీసుకుంటున్న కఠిన చర్యలను తీర్మానాల రూపంలో చర్చించనున్నారు. లబ్ధిదారులైన మహిళల విజయగాథలను డిజిటల్ వేదికలపై ప్రదర్శించడం ద్వారా.. మహాశక్తి పథకాలు మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన ఆర్థిక స్థిరత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని పొలిట్‌బ్యూరో తీర్మానించింది.

హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహణ.. 20 తీర్మానాలకు ఆమోదం

ప్రభుత్వం అవలంబిస్తున్న పొదుపు చర్యలకు అనుగుణంగా, ఈసారి మహానాడును బహిరంగ సభల ఆర్భాటం లేకుండా పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ ప్రతినిధులు నేరుగా హాజరవుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,848 క్లస్టర్ల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లక్షలాది మంది కార్యకర్తలు వర్చువల్ విధానంలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు రోజుల వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 20 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360