తమిళ స్టార్ హీరో సూర్యకు కొన్నేళ్లుగా సరైన విజయం లేదు. 'జై భీమ్' తరవాత సూర్య అందరికీ నచ్చే సినిమా ఇవ్వలేకపోయాడు. 'కంగువా', 'రెట్రో' సినిమాలు డిజాస్టర్లుగా మారిపోయాయి.
ఈ దెబ్బకు సూర్య సినిమా అంటేనే భయపడే పరిస్థితికి వచ్చేసింది. తాజాగా వచ్చిన `వీరభద్రుడు`పై కూడా ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. టీజర్, ట్రైలర్.. రెండూ రొడ్డకొట్టుడు రొటీన్ సినిమాల్ని తలపించాయి. పెద్దగా ప్రమోషన్లు చేసింది లేదు. ఓ రోజు ఆలస్యంగా కూడా వచ్చింది. అయితే అనూహ్యమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ముఖ్యంగా తమిళ నాట ఈ సినిమా నిలబడింది. తొలి రోజు దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసింది. ఈ యేడాది తమిళ సినిమాల్లో ఇదే రికార్డు. తొలి మూడు రోజులూ వసూళ్లు బాగున్నాయి. సోమవారం కూడా స్టడీగానే కనిపించాయి. కొన్ని వారాలుగా తమిళనాట పొలిటికల్ హీట్ నడిచింది. అక్కడ ఎన్నికలు అయిపోయాయి. విజయ్ ప్రభుత్వం కూడా స్థాపించాడు. జనాలు మెల్లగా సినిమాలవైపు దృష్టి సారించడం మొదలెట్టారు. ఎన్నికల హడావుడి తరవాత వచ్చిన పెద్ద సినిమా ఇదే. కాబట్టి.. జనం థియేటర్లకు రావడంపై ఆసక్తి చూపించారు. టాక్ అటూ ఇటుగా ఉన్నా, టికెట్లు తెగడానికి కారణం ఇదే.
తెలుగులో కూడా ఫుట్ ఫాల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో కాస్తో కూస్తో కలక్షన్లు కనిపిస్తున్నాయి. తెలుగులో మరో సినిమా లేకపోవడం, సూర్యకు మాస్ లో మంచి ఆదరణ ఉండడంతో… ఈ సినిమాకు కలిసొచ్చింది. నిజానికి ఈ మాత్రం వసూళ్లు కూడా ఎవరూ ఊహించలేదు. తెలుగులో ఈ సినిమాని అన్నపూర్ణ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. వాళ్లు కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. పబ్లిసిటీ చేయలేదు. రివ్యూల్లోనూ ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశారు విశ్లేషకులు. అయినా సరే.. ఈ మాత్రం టికెట్లు తెగాయంటే ఆశ్చర్యమే. ఈ అంకెలు సూర్యకు కాస్త బూస్టప్ ఇస్తాయి. తన తదుపరి సినిమా 'విశ్వనాథం అండ్ సన్స్' పై మంచి బజ్ వుంది. పైగా ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. మొన్న విడుదల చేసిన గ్లింప్స్ కూడా బాగుంది. 'వీరభద్రుడు' ఇచ్చిన జోష్ తో… 'విశ్వనాథం' కి మరింత హైప్ పెరగడం ఖాయం.

