ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు చేపట్టిన విస్తృత పర్యటన అటు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల ఉపాధి అవకాశాల పెంపునకు..
ఇటు ప్రజలతో మరింత భావోద్వేగ బంధం ఏర్పాటు చేసుకునే దిశగా సాగింది. నియోజకవర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా స్వర్ణ కుప్పం-పెట్టుబడుల వేదిక బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టారు.
భారీగా పరిశ్రమల ప్రారంభోత్సవాలు - కొత్త పరిశ్రమల శంకుస్థాపనలు
చంద్రబాబు ఈ పర్యటనలో భాగంగా ఏకంగా రూ.9,322 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 30కి పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు ఎంవోయూలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ మెగా ప్రాజెక్టుల ద్వారా కుప్పం పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా 39,535 మందికి, పరోక్షంగా మరో 47,539 మందికి భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందులో ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్‌వేర్ తయారీ సంస్థ నుండి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ విమానాల తయారీ ప్రాజెక్టు వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. పర్యటనలో భాగంగా స్థానిక పౌల్ట్రీ రైతులకు మేలు చేకూర్చే ఏబీఐఎస్ ప్రొటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు, 167 పారిశ్రామిక ప్లాట్లతో తీర్చిదిద్దిన ఏపీఐఐసీ ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కుప్పంకు ఆధునిక హంగులు
గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తూ సుమారు రూ.587 కోట్ల వ్యయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కుప్పం పట్టణ మౌలిక వసతులను ఆధునీకరించే క్రమంలో రూ.118 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రంలోనే అత్యంత అత్యాధునిక హంగులతో నిర్మించనున్న మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కుప్పం ఏరియా ఆసుపత్రిలో సరికొత్త సీటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను కూడా ఆయన అందుబాటులోకి తెచ్చారు. ఈ పర్యటనలో ఆరు దశాబ్దాలుగా నలుగుతున్న కంగుంది భూసమస్యకు చంద్రబాబు శాశ్వత పరిష్కారం చూపించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న 322 మంది రైతు కుటుంబాలకు 460.19 ఎకరాలపై చట్టబద్ధమైన డీకేటీ పట్టాలను అందజేశారు.
9 వేల కుటుంబాల బాధ్యత కార్పొరేట్ కంపెనీలకు
పర్యటన చివరి రోజున పౌల్ట్రీ రైతులు, అభ్యుదయ రైతులు, పీ4 లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. స్థానిక రైతాంగానికి ఆధునిక సాంకేతిక వ్యవసాయ విధానాలను అందించేలా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ.. ప్రముఖ సంస్థలైన ఐటీసీ , విశాలాక్షి ఇన్నోవేషన్స్‌తో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. నియోజకవర్గంలోని 9 వేల బంగారు కుటుంబాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను అదానీ, టీవీఎస్, మెగా సంస్థలకు అప్పగిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు మొత్తంగా వారం రోజుల పాటు జిల్లాల పర్యటనలు చేశారు. రోజుకు పదిహేను గంటల వరకూ ఆయన వివిధ కార్కక్రమాలతో బిజీగా ఉన్నారు.

