తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాల వల్ల దాదాపు 90 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు.
అయితే ఇవి నేరుగా ఓటర్లకు చేరలేదు. తమ ఓటు విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సి ఉందని ఇప్పటి వరకూ ఓటర్లకే తెలియదు. ఇప్పటివరకు సిస్టమ్‌లో కేవలం 30 లక్షల మందికి మాత్రమే నోటీసులు జనరేట్ అవ్వగా, క్షేత్రస్థాయిలో బిఎల్ఓ ల ద్వారా నేరుగా ఓటర్ల చేతికి అందింది కేవలం 2 లక్షల మందికి మాత్రమే. అంటే మొత్తం లక్ష్యంలో కనీసం 2 శాతం మందికి కూడా నోటీసులు చేరువ కాలేదు.
నోటీసులు జారీ అయిన వాళ్లు వివరణ ఇవ్వకపోతే ఓటు పోయినట్లే
ఇక్కడే అసలైన పసిగట్టలేని సమస్య వచ్చిపడింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో దాదాపు 17 లక్షల మందికి సంబంధించి, విజ్ఞప్తులు , సమాధానాలు ఇచ్చేందుకు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది. క్షేత్రస్థాయిలో సరైన సిబ్బంది లేకపోవడం, ఆన్‌లైన్ సర్వర్ల సాంకేతిక లోపాలు, పోలింగ్ కేంద్రాల పరిధిలో సరైన సమన్వయం లోపించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. నోటీసులు సరిగ్గా చేరకపోవడం వల్ల వేలాది మంది ఓటర్లు తమకు తెలియకుండానే ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ఓటు కోసం కూడా తిరిగేలా చేస్తారా?
ఎన్నికల సంఘం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే దానిపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు ఓటర్ల జాబితాను వేగంగా ప్రక్షాళన చేయాలనే తొందరలో, శాస్త్రీయ విధానాలను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ అస్తవ్యస్త పరిస్థితి తలెత్తింది. డూప్లికేట్ ఓట్లు, చిరునామా మార్పులు, చనిపోయిన వారి వివరాల తొలగింపు పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో సామాన్య ప్రజలు ఈసీ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఒక్క ఓటరుకి అన్యాయం జరిగినా ఈసీ వైఫల్యమే
సమయం తక్కువగా ఉండటం, మరోవైపు నోటీసుల పంపిణీ లక్ష్యం కొండంతగా మిగిలిపోవడంతో ఈ క్లిష్టమైన సమస్యను ఈసీ ఎలా పరిష్కరిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. లక్షలాది మంది అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ఉండాలంటే ఈసీ తక్షణమే గడువును పొడిగించడమే కాకుండా, బిఎల్ఓలకు అదనపు యంత్రాంగాన్ని కేటాయించి వార్డుల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

