తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక నియంత్రణ సంస్థగా ఉన్న తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్.
సత్యనారాయణ తన పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ఇంకా దాదాపు రెండేళ్ల సమయం ఉండగానే, ఆయన వ్యక్తిగత ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రెరాకు తొలి పూర్తిస్థాయి చైర్మన్‌గా 2023 జూన్‌లో సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2017 నుంచి ఇన్-ఛార్జ్ లతోనే సాగిన రెరాను, ఆయన వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేశారు. కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా అక్రమ వెంచర్లు, ప్రి-లాంచ్ మోసాలపై ఉక్కుపాదం మోపారు. కేవలం 10 నుంచి 21 రోజుల్లోనే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా డిజిటల్ గవర్నెన్స్‌ను అమలు చేశారు. ఆయన హయాంలో రికార్డు స్థాయిలో 10,817 ప్రాజెక్టులు, 5,106 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రిజిస్టర్ కావడం ద్వారా దేశంలోనే తెలంగాణను ఐదో స్థానంలో నిలిపారు. అంతేకాకుండా, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న 2,764 ఫిర్యాదులలో ఏకంగా 1,764 కేసులను విచారించి బాధితులకు న్యాయం చేశారు.
సత్యనారాయణ వైదొలగడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త చైర్మన్ వేటను ముమ్మరం చేసింది. జూన్‌లో రిటైర్ కాబోతున్న ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , మాజీ సీఎస్ శాంతికుమారి పేర్లు ఈ ప్రతిష్టాత్మక పోస్టు కోసం పరిశీలనలో ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఐదేళ్ల పదవీకాలం లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉండటంతో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నుంచి భారీగా పోటీ నెలకొంది. త్వరలోనే సెర్చ్ కమిటీ ద్వారా కొత్త చైర్మన్‌ను ఎంపిక చేయనున్నారు.
మరోవైపు, సత్యనారాయణ బాటలోనే రెరా బోర్డులోని మరికొందరు కీలక సభ్యులు కూడా తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తుండటంతో ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ మోసాల నియంత్రణకు, కొనుగోలుదారుల హక్కులు కాపాడటానికి రెరా చాలా కీలకం కావడంతో.. రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

