తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక ఖరారుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ఉత్తరాంధ్రలో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ సమయంలో ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో వేదిక మార్చాలని నిర్ణయించారు.
భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి మోదీ రానున్నారు. ఈ సందర్భంగా జూన్ , జూలై నెలల్లో ఉత్తరాంధ్రలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఒకే ప్రాంతంలో తక్కువ కాల వ్యవధిలో రెండు భారీ కార్యక్రమాలు నిర్వహించడం కంటే, వేర్వేరు ప్రాంతాల్లో సభలు నిర్వహించడం ద్వారా పార్టీ మైలేజీని పెంచుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. అందుకే శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వేదికను మార్చారు.
నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు, పార్టీ అక్కడ బలంగా ఉంది. జూన్ నెలలో మోదీ సభ ఉత్తరాంధ్రలో ఎలాగూ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు నెల్లూరులో మహానాడు నిర్వహించడం ద్వారా దక్షిణ ఆంధ్రలో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపవచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు నేతలకు ఏర్పాట్లపై ఇప్పటికే ప్రాథమిక ఆదేశాలు వెళ్లాయి.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న తరుణంలో, ప్రధాని మోదీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో మోదీ సభ జరిగే సమయంలోనే అక్కడ పార్టీ శ్రేణులన్నీ కేంద్రీకృతమవుతాయి. కాబట్టి మే నెలాఖరున జరిగే మహానాడును నెల్లూరులో నిర్వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా రెండు వేర్వేరు కీలక ప్రాంతాల్లో పార్టీ ఉనికిని బలంగా చాటుకోవచ్చనేది వ్యూహం. ఎన్టీఆర్ జయంతి మే 28 సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం నెల్లూరు నగర పరిసరాల్లో అనువైన ప్రదేశాలను పార్టీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఖచ్చితమైన ప్రాంతాన్ని ప్రకటించనున్నారు.

