టికెట్ రేట్ల పెంపు వ్యవహారంలో టాలీవుడ్ నిర్మాతలు ఒకొక్కరూ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. కొంతమంది టికెట్ రేట్లు పెంచుకొంటే తప్పేంటి? అని వాదిస్తుంటే, మరికొంతమంది మాత్రం టికెట్ రేట్లు పెంచడం వల్ల లాభమేంటి?
అని ప్రశ్నిస్తున్నారు. తాజాగా నిర్మాత ధీరజ్ మొగలినేని కూడా ఇదే మాట చెబుతున్నారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలు చితికిపోతున్నాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకడం లేదని, చిన్న సినిమాల్ని బతికించాలంటే అసలు ఏ సినిమాకీ టికెట్ రేట్ల పెంపు ఇవ్వొద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్వతహాగా పెద్ద సినిమాలు వస్తున్నప్పుడే రేట్ల పెంపు వ్యవహారంపై చర్చ నడుస్తుంది. రేట్లు పెంచినా, తగ్గించినా అది పెద్ద సినిమాల వ్యవహారం. కానీ వాటి వల్ల చిన్న సినిమాలకు ఇబ్బంది రావడమే అసలు చర్చ. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలూ వస్తుంటాయి. అలాంటప్పుడు ఎగ్జిబీటర్లు పెద్ద సినిమాలు ప్రదర్శించుకోవడానికే ఉత్సాహం చూపిస్తుంటారు. పెద్ద సినిమా టికెట్ రేట్లు ఎక్కువ. దాన్ని బట్టే పర్సంటేజీ వస్తుంది. పెద్ద సినిమాలకు ఎక్కువ పర్సంటేజీ, చిన్న సినిమాలకు తక్కువ పర్సంటేజీ వచ్చినప్పుడు.. ఎగ్జిబీటర్లు పెద్ద సినిమాల్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకవు. ధీరజ్ మొగలినేని కూడా ఇదే విషయం ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో చిన్న నిర్మాతలంతా ఏకమై.. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ధీరజ్ మొగలినేని నిర్మాణంలో రూపొందిన సమ్మర్ హాలిడేస్ నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇది వరకే చాలాసార్లు రిలీజ్ డేట్ ప్రకటించుకొని, ఆ తరవాత వాయిదా వేసుకోవాల్సివచ్చింది. ఈసారి మాత్రం 6న రావడం ఖాయమంటున్నారు నిర్మాత.

