తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి తిరుచ్చి ఉపఎన్నికపైనే పడింది. తమిళగ వెట్రి కజగం అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రెండు చోట్ల గెలవడంతో తిరుచ్చికి రాజీనామా చేశారు.
డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ కొళత్తూరులో ఓడిపోవడంతో ఆయన అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు తిరుచ్చి ఉపఎన్నికతో గొప్ప అవకాశం వచ్చినట్లుగా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.
అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు స్టాలిన్ తిరుచ్చిని ఎంచుకుంటారనే ప్రచారం తమిళ మీడియాలో జోరుగా సాగుతోంది. సాంప్రదాయకంగా డీఎంకేకు గట్టి పట్టున్న ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ కూడా అప్పుడే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ మానియా కనిపిస్తున్నప్పటికీ, మరో ఆరు నెలల తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పలేమని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక విజయ్ ఇప్పటికే ఇతర పార్టీలతో కలిసి కిచిడీ కూటమి ప్రభుత్వాన్ని నడపాల్సి వస్తోంది. సిద్ధాంతాల పరంగా తాను మిగతా రాజకీయ పార్టీల కంటే భిన్నమేమీ కాదనే విషయాన్ని విజయ్ తన చర్యల ద్వారా నిరూపించుకోవాల్సి రావడం ఆయన ఇమేజ్‌ను కాస్త డ్యామేజ్ చేస్తోంది.
ఇదే సమయంలో, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్టాలిన్ దురదృష్టవశాత్తూ ఓడిపోయారనే సానుభూతి ప్రజల్లో బలంగా ఉంది. ఆయన లాంటి సీనియర్ నేత అసెంబ్లీలో ఉండాలనే భావన సామాన్య ఓటర్లలో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో తిరుచ్చిలో విజయ్ సాధించిన విజయం ఏకపక్షమేమీ కాదు. కేవలం 25 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతోనే ఆయన గట్టెక్కారు. నియోజకవర్గంలో డీఎంకేకు ఉన్న క్యాడర్ బలాన్ని తక్కువ అంచనా వేయలేము. దీనికి తోడు, కూటమి ప్రభుత్వంలో విజయ్ అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల అన్నాడీఎంకే శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవేళ స్టాలిన్ ఇక్కడ బరిలోకి దిగితే, విజయ్ హవాకు చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకేకు చెందిన స్థానిక అగ్రనేతలు, కార్యకర్తలు లోపాయికారీగా డీఎంకేకు మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు.
అందుకే డీఎంకే అధిష్ఠానం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ స్టాలిన్ తిరుచ్చి నుంచి పోటీ చేస్తే, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని భావిస్తోంది. విజయ్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి అంచనా రాకముందే, ఈ ఉపఎన్నిక ద్వారా టీవీకే మానియాకు బ్రేకులు వేయాలనేది డీఎంకే ప్లాన్. ఈ ప్రచారం నిజమై స్టాలిన్ కనుక బరిలోకి దిగితే, తిరుచ్చి ఉపఎన్నిక కేవలం ఒక నియోజకవర్గ పోరుగా కాకుండా, తమిళనాడు భవిష్యత్తు రాజకీయాల దిశను మార్చే మహా సంగ్రామంగా మారడం ఖాయం.

