Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యమకారుల గుర్తింపు - పెద్ద సవాలే!

ఉద్యమకారుల గుర్తింపు - పెద్ద సవాలే!

Telugu 360 1 week ago

తెలంగాణ ఉద్యమకారుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి, వారి త్యాగాలకు తగిన గౌరవం కల్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి అందరికీ మేలు చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆ మేరకు చర్యలు ప్రారంభించారు.

బీఆర్ఎస్ ఉద్యమకారులకే ఇప్పటి వరకూ మేలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన నిజమైన ఉద్యమకారులను గుర్తించడంలో గత పదేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగింపు పలికారు. కేవలం రాజకీయంగా దగ్గరగా ఉన్నవారికే గుర్తింపు దక్కిందన్న విమర్శలు ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఉద్యమకారుడిని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీనియర్ నాయకులు కేకే ఛైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ వంటి ఉద్యమ మూలాలున్న నేతలకు చోటు కల్పించారు.

ఉద్యమకారుల్ని గుర్తించలేదని బీఆర్ఎస్‌పై విమర్శలు

తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నాయి. ఉద్యమంతో సంబంధం లేని వారికి పదవులు ఇచ్చి, లాఠీ దెబ్బలు తిన్న వారిని గాలికి వదిలేశారన్న అసంతృప్తి ఉద్యమ శ్రేణుల్లో బలంగా ఉంది. కవిత సైతం ఒక సందర్భంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామని క్షమాపణలు చెప్పారు. అందుకే రేవంత్ ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్ది, నిజమైన 'తెలంగాణ ఉద్యమకారుల'ను వెలికితీసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది.

అసంతృప్తి లేకుండా విధి విధానాల ఖరారు

ఈ కమిటీ కేవలం నామమాత్రంగా కాకుండా, పక్కాగా విధివిధానాలను రూపొందించనుంది. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, జైలు శిక్షలు, చురుగ్గా పాల్గొన్న సంఘటనల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనుంది. ఎవరెవరు తెలంగాణ ఉద్యమకారులు అనే అంశంపై ఒక సమగ్ర జాబితాను సిద్ధం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. దీనివల్ల ఇన్నాళ్లు గుర్తింపు నోచుకోని మారుమూల గ్రామాల్లోని కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.

కేవలం గుర్తింపు కార్డులు ఇవ్వడమే కాకుండా, ఉద్యమకారులకు ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన గౌరవ మర్యాదలు, ఇతర సౌకర్యాలపై కూడా కమిటీ సిఫార్సులు చేయనుంది. పెన్షన్లు, బస్సు పాస్‌లు, వైద్య సదుపాయాలు లేదా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వారికి ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించడం ద్వారా వారి త్యాగాలను సమాజం గుర్తించేలా చర్యలు తీసుకోనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360