జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో తన శ్రేణులకు గట్టి దిశానిర్దేశం చేశారు.
తమిళనాడు రాజకీయ పరిణామాలతో ఏపీని పోల్చవద్దని, ఇక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నమని స్పష్టం చేస్తూనే, విపక్ష వైసీపీ విమర్శలపై పదునైన వ్యాఖ్యలు చేశారు.
పక్క రాష్ట్రం తమిళనాడులో సినిమా నటుడు విజయ్ పార్టీ పెట్టి గెలవగానే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనం అలాగే ఒంటరిగా వెళ్లి ఉండాల్సిందని కొందరు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. అక్కడ సామాజిక సమీకరణాలు భిన్నంగా ఉంటాయి. గతంలో మనం ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నాం, నేను కూడా రెండు చోట్ల ఓడిపోయాను. భావోద్వేగాలతో కాకుండా వాస్తవాలతో రాజకీయం చేయాలి. అనవసరమైన పోలికలు పెట్టి గందరగోళం సృష్టించవద్దు అని ఆయన కేడర్‌కు హితవు పలికారు.
జనసేనను కేవలం ఒకే ఒక్క కులానికి లేదా ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలని చూస్తున్న శక్తులపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమను ఒక వర్గానికే పరిమితం చేయాలని చూస్తే దాన్ని గట్టిగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. మనం అందరి కోసం పని చేసే పార్టీ. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే మన లక్ష్యం. మనల్ని కుల చట్రంలో బంధించాలని చూసే కుట్రలను సాగనివ్వద్దు అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన పాత్ర పోషించే క్రమంలో అన్ని వర్గాలను కలుపుకుపోవడమే తమ ప్రాధాన్యతని వివరించారు.
ఇటీవల కాపు సామాజిక వర్గంపై వైసీపీ నేతలు చూపిస్తున్న ప్రేమపై పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని వేధించి, ఇప్పుడు సడన్‌గా కొత్త ప్రేమలు ఒలకబోస్తున్నారు. మేమేం చేశామని గొంతులు చించుకుని అడుగుతున్నారు. గత ఐదేళ్లలో మీరు చేసిన అరాచకాలు, వేధింపులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. మీరేం చేశారో చెప్పకుండా మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు అంటూ ఎదురుదాడి చేశారు. వైసీపీ చేస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సమయంలో కార్యకర్తలు అత్యంత సంయమనంతో, బాధ్యతగా వ్యవహరించాలని పవన్ కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఇదని గుర్తు చేశారు. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూనే, వాస్తవిక రాజకీయాల పట్ల వారికి అవగాహన కల్పించారు.

