మహేష్ బాబుని రాముడి గా చూడాలన్నది ఆయన అభిమానుల ఆశ. అది 'వారణాసి'తో తీరబోతోంది. మహేష్ ఈ సినిమాలో రాముడి అవతారంలో కనిపిస్తారని రాజమౌళి సైతం ప్రకటించేశారు.
రాముడి గెటప్, అందులోనూ రాజమౌళి సినిమా అంటే.. ఇక అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాముడి గెటప్ ని వీలైనంత త్వరగా బయటకు వదిలితే బాగుంటుందన్నది ఆయన అభిమానుల ఆశ. మే 31 సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాముడి అవతారంలో మహేష్ లుక్ బయటకు వదులుతారని ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే. రాముడి గెటప్‌కి సంబంధించిన ఎపిసోడ్ ఆల్రెడీ షూట్ చేసేశారు. కాబట్టి.. రాజమౌళి దగ్గర కావాల్సినంత ఫుటేజీ ఉంటుంది.
కాకపోతే… రాజమౌళి టీమ్ మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాముడి గెటప్ ని ముందే రివీల్ చేసి, ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేస్తే బాగుంటుందా? లేదంటే దాన్ని వెండి తెరపై చూసేంత వరకూ గోప్యంగా ఉంచాలా? అనే విషయంలోనూ టీమ్ తర్జన భర్జనలు పడుతోంది. ఇది లీకేజీల కాలం. సినిమాని ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, ఏదో ఓ రూపంలో స్టిల్లో, సెట్లో ఫుటేజీనో బయటకు వచ్చేస్తోంది. ఈ లీకేజీల బెడద గురించి అందరి కంటే రాజమౌళికే బాగా తెలుసు. దాన్నుంచి తప్పించుకోవాలంటే ముందే లుక్ రివీల్ చేయడం మంచిదనుకొంటే మాత్రం ఈ మే 31న మహేష్ ని రాముడిగా చూసేయొచ్చు. కానీ రాముడిగా మహేష్‌ని వెండి తెరపై చూసినప్పుడే అసలైన థ్రిల్ అనుకొంటే మాత్రం.. సినిమా విడుదల వరకూ ఆ లుక్ బయటకు రాదు. నిర్ణయం ఏదైనా సరే, పూర్తిగా రాజమౌళి చేతుల్లోనే ఉంది.
కాకపోతే.. రాముడిగా మహేష్ లుక్, ఆ ఎపిసోడ్ నెక్ట్స్ లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవలే 'రామాయణ'లోంచి రాముడిగా రణబీర్ కపూర్ లుక్ వచ్చింది. దానిపై డివైడ్ టాక్ నడుస్తోంది. మరోవైపు మహేష్ ఫ్యాన్స్ మాత్రం 'మా రాముడు ఇంత కంటే గొప్పగా ఉంటాడు' అని రిలాక్సయిపోతున్నారు. వాళ్ల మాట నెగ్గిందో, లేదో తెలియాలంటే లుక్ బయటకు రావాల్సిందే.

