Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ ఎమ్మెల్యే అయితే సోదాలు చేయకూడదా!?

వైసీపీ ఎమ్మెల్యే అయితే సోదాలు చేయకూడదా!?

Telugu 360 1 week ago

ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించడంపై వైసీపీ నేతలు తెగ ఫీలైపోతున్నారు.

బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి సూర్య గ్రానైట్స్ అనే కంపెనీ ఉంది. అందులో ఆయన ఇష్టారీతిన అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నట్లుగా తేలడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర గ్రానైట్ కంపెనీలను టార్గెట్ చేసి .. ఈ బూచేపల్లి చేయని దందా లేదు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.

నాటి 'సిద్ధా' ఎపిసోడ్ గుర్తుందిగా!

ఇప్పుడు రెండేళ్ల తర్వాత అధికారులు సోదాలు చేస్తే కక్ష సాధింపుల మాటున దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కక్ష సాధింపే చేయాలనుకుంటే ప్రస్తుత ప్రభుత్వం వేరేలా వ్యవహరించేది. గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు సహా టీడీపీ నేతల మైనింగ్ వ్యాపారాలపై ఏ విధంగా విరుచుకుపడ్డారో అందరూ చూశారు. తప్పుడు నివేదికలతో వందల కోట్ల రూపాయల జరిమానాలు విధించి, వారిని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసి చివరికి పార్టీ మారేలా ఒత్తిడి తెచ్చిన తీరును నిజమైన కక్ష సాధింపు కు ఉదాహరణగా చెబుతున్నారు. కానీ బూచేపల్లి విషయంలో ప్రభుత్వం రెండేళ్ల వరకు ఎలాంటి జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కేవలం అక్రమాలపై ఫిర్యాదులు రావడంతోనే తనిఖీలు జరిగాయని స్పష్టమవుతోంది.

తప్పు చేయకపోతే భయం ఎందుకు?

క్వారీల్లో ఉత్పత్తి ఎంత? అమ్మకాలు ఎంత? అనే వివరాలను సేకరించడం మైనింగ్ శాఖ సాధారణ బాధ్యత. హైటెక్ సర్వే కెమెరాలతో శాస్త్రీయంగా కొలతలు తీస్తున్నప్పుడు, తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదు. కక్ష సాధింపులని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయలేరు. వైసీపీ మాటున దాక్కుంటే తాము చేసిన అక్రమాలు చెల్లిపోతాయని భావించడం సరికాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దానికి రాజకీయ రంగు పూయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని చెప్పాల్సిన పని లేదు.

రెడ్ బుక్ సాకుతో తప్పించుకోలేరు

అధికారులు జరిపే సాధారణ తనిఖీలను కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే, గతంలో జగన్ హయాంలో జరిగినట్లుగా ఎవరినీ వ్యక్తిగతంగా వేధించడం లేదని, కేవలం ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే మైనింగ్ దోపిడీపైనే దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. తప్పులు చేసి వైసీపీ ముసుగులో తప్పించుకోవాలని చూస్తే కుదరదని, చట్టపరమైన విచారణకు సహకరించకుండా రాజకీయ నినాదాలు చేయడం వల్ల ప్రయోజనం లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360