Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ పెట్రో డ్రామాలు - మోదీ పేరెత్తే ధైర్యం లేదా?

వైసీపీ పెట్రో డ్రామాలు - మోదీ పేరెత్తే ధైర్యం లేదా?

Telugu 360 6 days ago

ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష వైసీపీకి రాజకీయం అంటే నవ్వులాటగా మారిపోయినట్లుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మూడు రూపాయలను పెట్రోలియం కంపెనీలు పెంచేసరికి, వీధి డ్రామాలకు తెరతీశారు.

భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఎండను కూడా లెక్కచేయకుండా తలా ఒక వేషం వేసి రోడ్లపై కామెడీ షోలు పండించారు. విచిత్రం ఏంటంటే, అసలు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల, కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచితే.. ఆ కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూడకుండా, ఒక్క మాట కూడా అనకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై పడి ఏడవడం వీరికే చెల్లింది.

అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు చూసి జనం కూడా అబ్బా.. మూడు రూపాయలే కదా పెరిగింది, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంటే, వీరు మాత్రం ఏదో మునిగిపోయినట్లు నానా హంగామా చేసి జనం దృష్టిలో కేవలం కామెడీ పీసులు గా మిగిలిపోయారు. అసలు కథేంటో జనాలకి తెలియదు అనుకోవడం వీరి అమాయకత్వం. దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉండటానికి అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదో.. సాక్షాత్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి !

ఆయన 2019లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కడంతోనే రోడ్ సెస్ అంటూ ముద్దుగా పేరు పెట్టి, లీటరుకు రెండు రూపాయల వడ్డనతో జనం జేబులకు చిల్లు పెట్టారు. ఆ తర్వాత ఆ రేట్లను తగ్గించే ప్రయత్నమే చేయకుండా, ఉన్నవన్నీ ఊడ్చేసి, అప్పుల కుప్పలు చేసి గద్దె దిగారు.నాడు జగన్ రెడ్డి వేసిన ఆ రోడ్ సెస్ బాదుడు వల్లనే నేటికీ ఏపీలో ఇంధన ధరలు దేశంలోనే టాప్‌లో దూసుకుపోతున్నాయి. నాడు రోడ్ల రిపేర్ల కోసం అని చెప్పి వసూలు చేసిన ఆ సొమ్ము ఏ గుంత పూడ్చడానికైనా వాడారా అంటే అదీ లేదు.

జగన్ హయాంలో రోడ్ల నిండా గుంతలే తప్ప, ఆ సెస్ డబ్బులు ఎటు పోయాయో దేవుడికే ఎరుక. తాము అధికారంలో ఉన్నప్పుడు పెంచిన పన్నుల భారాన్ని, చేసిన అప్పులను ప్రజలు అంత తేలికగా మర్చిపోయారని వైసీపీ నేతలు భ్రమిస్తున్నారు. నాడు తాము చేసిన పాపాలను దాచేసి, ఇప్పుడు అధికారంలో లేము కాబట్టి ఏదో ఒక డ్రామా ఆడాలనే తాపత్రయం తప్ప వైసీపీ నిరసనల్లో అణాపైసా పస లేదు. ప్రజల సమస్యల కోసం నిర్మాణాత్మకంగా పోరాడటం చేతకాక, ఇలాంటి సిల్లీ ట్రిక్కులతో వీధి నాటకాలు వేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360