రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు, విలాసవంతమైన ఇంటీరియర్ అని భావించే ధనవంతులు.. ఇప్పుడు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు.
కేవలం విలాసం కంటే ఆరోగ్యం, ప్రశాంతత కే పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలోనే వెల్నెస్ రియల్ ఎస్టేట్ అనే విభాగం అగ్రశ్రేణి పెట్టుబడిదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇల్లు అంటే కేవలం నివాసం మాత్రమే కాదు, అది నిరంతరం ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక వేదికగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.
ఈ రకమైన ఇళ్లలో సాంకేతికతకు , ప్రకృతికి మధ్య అద్భుతమైన సమతుల్యత కనిపిస్తుంది. గదిలో గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించే అత్యాధునిక సెన్సార్లు, రసాయన రహిత నీటిని అందించే ప్రత్యేక శుద్ధి వ్యవస్థలు, సహజ కాంతి ధారాళంగా వచ్చేలా రూపొందించిన ఆర్కిటెక్చర్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా, మానసిక ప్రశాంతతను ఇచ్చే బయోఫిలిక్ డిజైన్ ద్వారా ఒత్తిడిని తగ్గించేలా ఈ ఇళ్లను తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కలిసి ఇంటిని ఒక రక్షణ కవచంలా మారుస్తున్నాయి.
ధర విషయానికి వస్తే, ఈ వెల్నెస్ ఫీచర్లు ఉన్న ఇళ్లకు సాధారణ ప్రీమియం ఇళ్ల కంటే 20% నుండి 30% వరకు అదనపు ధరపలుకుతోంది. నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంపన్నులు ఈ అదనపు భారాన్ని భరించేందుకు వెనుకాడటం లేదు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలతో పాటు బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో ఇటువంటి ప్రాజెక్టులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా ఈ మార్పును పసిగట్టి, తమ తదుపరి ప్రాజెక్టుల్లో వెల్నెస్ ను ప్రధాన అంశంగా మలుస్తున్నారు.
భవిష్యత్తులో ఈ ధోరణి కేవలం లగ్జరీ ఇళ్లకే పరిమితం కాకుండా మధ్యతరగతి గృహ నిర్మాణాల్లోకి కూడా చొచ్చుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోవిడ్ తర్వాతి కాలంలో ఆరోగ్యంపై పెరిగిన అవగాహన, రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. గాలి, నీరు, వెలుతురు వంటి సహజ వనరులను సాంకేతికతతో జోడించి నిర్మిస్తున్న ఈ ఇళ్లు.. మనిషి ఆయుష్షును పెంచే ఆరోగ్య నిలయాలుగా మారుతున్నాయి. పెట్టుబడి కోణంలో చూసినా, భవిష్యత్తులో ఇటువంటి ఇళ్లకు రీసేల్ వాల్యూ కూడా భారీగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

