జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక సేవ, ప్రజాహిత కార్యక్రమాలలో చేసిన కృషిని గుర్తిస్తూ తమిళనాడుకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ వేల్స్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
చెన్నై పల్లవరంలోని తమ క్యాంపస్‌లో నిర్వహించనున్న 14వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ గౌరవాన్ని అందుకోవాల్సిందిగా వర్సిటీ ఛాన్స్ లర్ డాక్టర్ ఐశారి కె. గణేష్ ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపారు. అయితే, ఈ ఆఫర్‌ను పవన్ కళ్యాణ్ అత్యంత సున్నితంగా తిరస్కరిస్తూ వర్సిటీ యాజమాన్యానికి ప్రత్యేక లేఖ రాశారు.
తమ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కోసం తన పేరును ఎంపిక చేయడం పట్ల పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూనే, ఈ గౌరవాన్ని స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు. వివిధ రంగాలలో దేశానికి ఎనలేని సేవలు అందించి, సమాజంలో నాకంటే ఎంతో గొప్పగా రాణించిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. అటువంటి అర్హులైన అసాధారణ వ్యక్తులకు ఈ డాక్టరేట్ ఇవ్వడం సముచితంగా ఉంటుంది అని పవన్ తన లేఖలో పేర్కొన్నారు. అయాచితంగా వచ్చే పదవులు, బిరుదుల కంటే ప్రజాసేవలోనే తనకు నిజమైన తృప్తి ఉంటుందని ఆయన ఈ నిర్ణయం ద్వారా స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, నిరంతర పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ కారణంగా తాను ఈ స్నాతకోత్సవ వేడుకకు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ వివరించారు. సాధారణంగా ఎవరైనా డాక్టరేట్ అనగానే ఎంతో సంతోషంగా స్వీకరిస్తారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ హోదాను నిరాకరించి తనకంటే అర్హులైన వారికి ఇవ్వమనడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ 14వ స్నాతకోత్సవంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు ఇస్రో చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్‌కు వేల్స్ వర్సిటీ గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నరు.

