దేశమంతా విజయ్ పేరు ప్రతిధ్వనిస్తోంది. సినిమా స్టార్ నుంచి పొలిటికల్ స్టార్ గా మారిన విజయ్ విజయసోపానాల్ని దేశమంతా నెమరు వేసుకొంటోంది. పొలిటికల్ కబుర్లు అటుంచితే… ఆయన నటించిన సినిమా 'జన నాయగన్' కి అనూహ్యమైన క్రేజ్ వచ్చేసింది.
`ఇదే నా చివరి చిత్రం` అంటూ విజయ్ ఇది వరకే ప్రకటించారు. సో.. ఆ రకంగా చూసినా, విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి విడుదల అవుతున్న చిత్రంగా చూసుకొన్నా - జన నాయగన్ రేంజ్ ఎక్కడో కనిపిస్తోంది. తమిళనాట ఈ సినిమా ప్రభంజనం సృష్టించడం ఖాయం. టాక్ ఎలాగున్నా - బాక్సాఫీసు మీద పడిపోతారు విజయ్ ఫ్యాన్స్. అక్కడ వసూళ్ల విషయంలో ఎన్ని అంచనాలు పెంచుకొన్నా ఫర్వాలేదు. అయితే ఆ క్రేజ్ తెలుగులోనూ క్యాష్ చేసుకొంటారా అనేది ఆసక్తికలిగిస్తోంది.
మొన్నటి వరకూ ఈ సినిమాని తెలుగులో పట్టించుకొనే నాధుడే లేడు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసి ఉంటే.. పోటీలో కూడా కనిపించకుండా పోయేది. పైగా తెలుగులో సూపర్ హిట్టయిన `భగవంత్ కేసరి`కి ఇది రీమేక్. సో.. చూసిన సినిమానే ఎందుకు చూస్తారు? కాబట్టి తెలుగులో ఈ సినిమాని విడుదల చేయడానికి సాహసం కూడా చేయకపోదురు.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. విజయ్ క్రేజ్ ఎలాంటిదో తెలుగు వాళ్లకూ ఇప్పుడు బాగా తెలిసింది. దాంతో.. సినిమాపైనా ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా.. ఓ మంచి డేట్ ఫిక్స్ చేసుకొంటే, ఆ సమయంలో తెలుగులోనూ సినిమాలు లేకపోతే - తప్పకుండా విజయ్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. తెలుగు రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్లు అందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

