తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అస్థిరత ఒక విచిత్రమైన పరిస్థితికి దారితీసింది. ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టి, విశ్వాస పరీక్షలో నెగ్గినప్పటికీ..
ఆయన ప్రభుత్వ మనుగడపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే, పైకి విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం పడిపోకుండా కాపాడుతున్నది స్వయంగా స్టాలినే. భవిష్యత్‌లోనూ ఆయన కాపాడతారు.
తనే అండగా ఉన్నానని గుర్తు చేయడమే స్టాలిన్ టార్గెట్
తమిళనాడులో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఆ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లేదని ఎం.కె. స్టాలిన్ పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితిని గమనిస్తే విజయ్ ప్రభుత్వాన్ని తెరవెనుక నుంచి కాపాడుతున్నది స్టాలినే . ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణం స్టాలిన్ తన మిత్రపక్షాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఆయన గట్టిగా పట్టుబట్టి ఉంటే.. రాష్ట్రపతి పాలన వచ్చేది. ఇది స్టాలిన్ కు ఇష్టం లేదు. తాము మళ్లీ ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన నేరుగానే చెబుతున్నారు.
విజయ్ వైఫల్యం కోసమే నిరీక్షణ
తమిళనాడు ఓటర్లలో విజయ్‌పై ఉన్న విపరీతమైన క్రేజ్, సానుభూతి ఇంకా తగ్గలేదు. ఇప్పుడు గనుక ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే, విజయ్ మళ్ళీ భారీ మెజార్టీతో వచ్చే అవకాశం ఉందని సహజంగానే అంచనా వేయవచ్చు. అందుకే, పాలనాపరంగా విజయ్ అనుభవం లేకపోవడం వల్ల వచ్చే తప్పిదాలను, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులను రాజకీయ అస్త్రాలుగా మార్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు. విజయ్ పాలన చేతకాక ప్రభుత్వం విఫలమైంది అనే ముద్ర ప్రజల్లో బలంగా పడిన తర్వాతే ఎన్నికలకు వెళ్లడం డీఎంకేకు క్షేమకరమని ఆయన వ్యూహం.
అన్నాడీఎంకే చీలిక - డీఎంకేకు లాభం
విజయ్ ప్రభుత్వం నిలబడటానికి అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు ఇచ్చింది. ఈ చీలిక వల్ల డీఎంకేకు ఉన్న ప్రధాన ప్రతిపక్ష బలం మరింత పెరిగింది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతే, అన్నాడీఎంకే కేడర్ అంతా విజయ్ వైపు మళ్లి, డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చే ప్రమాదం ఉంది. అందుకే, అన్నాడీఎంకే పూర్తిగా బలహీనపడే వరకు, విజయ్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగే వరకు ప్రస్తుత ప్రభుత్వం కొనసాగడం స్టాలిన్‌కు అవసరం. అందుకే ఆయన విమర్శలు చేస్తున్నారే తప్ప, ప్రభుత్వాన్ని కూల్చే ఆపరేషన్ ను ప్రారంభించడం లేదు.
స్టాలినే ఆక్సిజన్
ఒక రకంగా విజయ్ ప్రభుత్వానికి స్టాలిన్ ఇస్తున్న ఆక్సిజన్ ..ఆయన ఇప్పుడే ఆపేయరు. ప్రజలు పూర్తిస్థాయిలో విజయ్ పాలనపై విరక్తి చెందే సమయం కోసం ఆయన క్యాలెండర్ చూసుకుంటున్నారు. ఆ సమయం వచ్చాకే డీఎంకే తన అసలైన రాజకీయ దాడిని మొదలుపెట్టనుంది. అటు విజయ్ కూడా ఈ విషయాన్ని గ్రహించారు. స్టాలిన్ వ్యూహాలకు తగ్గట్లుగా కౌంటర్ పాలన చేయాలని ఆయన అనుకుంటున్నారు.

