తమిళనాడులో సీఎం విజయ్ విష్ణు రెడ్డిని ప్రజా కార్యక్రమాలు, సాధారణ వ్యవహారాల సలహాదారుగా నియమించారు. అయితే, ఈ నియామకం జరిగిన కొద్ది గంటల్లోనే రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది.
విష్ణు రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం నిందితుడు అనిల్ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే వార్తలు వెలుగులోకి రావడమే ఇందుకు కారణం.
పీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న అనిల్ రెడ్డి, ప్రస్తుత సీఎం సలహాదారు విష్ణు రెడ్డిలు పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన విజయ్, తన తొలి నియామకాల్లోనే ఇలాంటి వివాదాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తికి అత్యున్నత పదవిని కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కాలేజీ రోజుల నాటి మిత్రుడనే ఒకే ఒక్క కారణంతో, ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
గతంలో జ్యోతిష్యుడు రికీ రతన్ పండిట్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి, తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు విష్ణు రెడ్డి నియామకం ద్వారా విజయ్ ప్రభుత్వం సరికొత్త లీగల్ , పొలిటికల్ సవాళ్లను కొనితెచ్చుకుందని, పొరుగు రాష్ట్రంలో ఉన్న లిక్కర్ స్కాం మూలాలు ఇప్పుడు తమిళనాడు సీఎంఓకు తాకడం రాష్ట్ర ప్రతిష్టకు భంగకరమని అంటున్నారు.
మరోవైపు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జాన్ అరోకియాసామిని రాజకీయ సలహాదారుగా నియమించిన వ్యవహారం కంటే.. విష్ణు రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదమే ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఈ నియామక ఉత్తర్వులను కూడా రద్దు చేస్తారా లేక తన ఆప్తుడికి అండగా నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది.

