ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన వేగవంతం కావడంతో విజయవాడ - గుంటూరు జాతీయ రహదారి రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన కేంద్రంగా మారింది.
మంగళగిరి పరిసర ప్రాంతాలతో పాటు హైవే వెంబడి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త హైరైజ్ అపార్ట్‌మెంట్లు, అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టుల లాంచింగ్స్ ఒక్కసారిగా పెరిగాయి. రాజధాని కోర్ సిటీతో పాటు ఈ పరిధిలోని ప్రాంతాలు కూడా ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను భారీగా ఆకర్షిస్తున్నాయి.
రాజధాని కోర్ సిటీకి అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడం, రోడ్ల విస్తరణ పనులు జరగడం ఈ ప్రాంతానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. కేవలం స్థానిక కొనుగోలుదారులే కాకుండా, ఓవర్సీస్ ఇన్వెస్టర్లు కూడా ఇక్కడి ప్రాజెక్టులపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హైవే బెల్ట్‌లో ప్రస్తుతం ' హైరైజ్ అపార్ట్‌మెంట్లు ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రముఖ జాతీయ, ప్రాంతీయ నిర్మాణ సంస్థలు ఇక్కడ 20 నుంచి 30 అంతస్తుల వరకు ఆకాశసౌధాలను, లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలను ప్లాన్ చేస్తున్నాయి. క్లబ్‌హౌస్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్స్, అత్యాధునిక సెక్యూరిటీ వంటి మెట్రో నగరాల తరహా సదుపాయాలతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
మరోవైపు, ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే వారి కోసం ప్రీమియం విల్లా ప్రాజెక్టులు కూడా భారీ లేఅవుట్లతో లాంచ్ అవుతున్నాయి. మంగళగిరి ఎయిమ్స్ , ఐటీ పార్క్ పరిసర ప్రాంతాలు ఈ తరహా లగ్జరీ హౌసింగ్‌కు ప్రధాన కేంద్రీకృత పాయింట్లుగా మారాయి. విజయవాడ, గుంటూరు నగరాలకు ఇరువైపులా సమాన దూరంలో ఉండటం వల్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు ఇక్కడ స్థిరపడటానికి మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ పాఠశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, కమర్షియల్ మాల్స్ కూడా ఈ హైవే పరిసరాల్లోకి వస్తుండటంతో ఈ ప్రాంతాల ఫేస్ వాల్యూ పూర్తిగా మారిపోతోంది.
రాజధాని ప్రాంతంలో ల్యాండ్ రేట్లు స్థిరంగా పెరుగుతుండటంతో, ఇప్పుడు పెట్టుబడి పెడితే లాంగ్ రన్‌లో మెరుగైన రిటర్న్స్ వస్తాయనే నమ్మకం ఇన్వెస్టర్లలో బలంగా ఏర్పడింది. రేట్లు మరీ అందుబాటు దాటిపోకముందే ప్రాపర్టీలను సొంతం చేసుకోవాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు. ప్రభుత్వ ల్యాండ్ పూలింగ్ జోన్ల వెలుపల ఉన్న ఈ ప్రైవేట్ మార్కెట్, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ఖరీదైన , ప్రణాళికాబద్ధమైన రెసిడెన్షియల్ కారిడార్‌గా అవతరించబోతోందని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

