Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ-అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో  సిగ్నేచర్ బ్రిడ్జి !

విజయవాడ-అమరావతి మధ్య రూ.1,000 కోట్లతో సిగ్నేచర్ బ్రిడ్జి !

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, విజయవాడల మధ్య రాకపోకలను మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ కృష్ణానదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1,000 కోట్ల వ్యయ అంచనాతో ప్రతిష్టాత్మక సిగ్నేచర్ బ్రిడ్జి ' నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు.

ఈ మేరకు డీపీఆర్ తయారీకి ప్రభుత్వం ప్రాథమిక అడుగులు వేస్తోంది.

ఈ ప్రతిపాదిత సిగ్నేచర్ వంతెనను విజయవాడ ప్రకాశం బ్యారేజీ , రైల్వే వంతెనల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. సుమారు 1.10 కిలోమీటర్ల పొడవునా, ఆరు లేన్ల విశాలమైన రహదారితో ఈ వంతెన నిర్మాణం జరగనుంది. ఇది విజయవాడ నగరంతో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు ద్వారా అమరావతికి అత్యుత్తమ కనెక్టివిటీని అందించి, భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ అవసరాలకు శాశ్వత పరిష్కారంగా నిలవనుంది.

ఈ బ్రిడ్జిని కేవలం రవాణా వ్యవస్థ కోసమే కాకుండా, రాజధాని అమరావతికి ఒక ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దనున్నారు. ఇందులో భాగంగా వంతెన ఇరువైపులా కాలినడకన వెళ్లే వారి కోసం ఫుట్‌పాత్‌లు, పర్యావరణ హిత ప్రయాణాన్ని ప్రోత్సహించేలా ప్రత్యేక సైకిల్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. నది అందాలను తిలకించేలా ఆధునిక లైటింగ్, ప్రత్యేక వ్యూ పాయింట్లతో ఈ వంతెనను డిజైన్ చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీపై ఇప్పటికే ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో, కృష్ణానదిపై రూపుదిద్దుకోబోతున్న ఈ మౌలిక వసతుల ప్రాజెక్టు ఏపీ రవాణా రంగానికి కొత్త ఊపిరి పోయనుంది. పర్యాటకరంగానికి పెద్దపీట వేస్తూ, అమరావతి అభివృద్ధి ప్రస్థానంలో మరొక ప్రతిష్టాత్మకమైన కట్టడంగా ఈ సిగ్నేచర్ బ్రిడ్జి నిలవనుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360