తమిళనాడులో కొత్తగా ఏర్పడిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై 35 కోట్ల హార్స్ ట్రేడింగ్ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో డీఎంకే కీలక నేత, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని టార్గెట్ చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేయడం, ముగ్గురిని అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ వ్యవహారంపై తమిళ రాజకీయ వర్గాల నుంచి భిన్నమైన విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. డీఎంకే ఇదంతా విజయ్ ప్రభుత్వం ఆడుతున్న రివర్స్ గేమ్ అని ఆరోపిస్తోంది.
విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం డీఎంకేకు ఉందా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌కు ఎంతమాత్రం లేదు. కేవలం ఏడు వారాల క్రితం ప్రజాతీర్పు ద్వారా కొలువుదీరిన ఒక కొత్త ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చేస్తే, అది డీఎంకేకు రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ప్రజల్లో విజయ్‌పై సానుభూతి పెరిగి, డీఎంకే అప్రతిష్ట పాలు కావాల్సి వస్తుంది. ఈ ముందస్తు రాజకీయ పరిణామాల అవగాహన ఉండబట్టే.. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్టాలిన్ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. అంతటి పరిణతి చూపించిన స్టాలిన్, ఇప్పుడు కేవలం ఒక స్పీకర్ అవిశ్వాస తీర్మానం కోసం ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని బలహీనపరిచే ఆనాలోచిత ప్రయత్నం చేసే అవకాశం లేదు.
ప్రలోభాల వల్లే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలు
ఈ వివాదంలో డీఎంకే ఒక సంచలన కౌంటర్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అసలు రాష్ట్రంలో హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడుతోంది డీఎంకే కాదు, అధికార టీవీకే నేతలేనని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే కి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా తమ పదవులకు రాజీనామాలు చేయడం , టీవీకే వైపు మొగ్గు చూపడం వెనుక ఉన్న మర్మం ఏమిటని డీఎంకే ప్రశ్నిస్తోంది. ఎలాంటి ప్రలోభాలు, తెరవెనుక హామీలు లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంత సులభంగా అధికార పక్షంలోకి ఎందుకు వెళ్తారో చెప్పాలంటున్నారు. తమ వైపు ఉన్న రాజకీయ అస్థిరతను, విపక్ష ఎమ్మెల్యేలను లాక్కునే వ్యూహాలను కప్పిపుచ్చుకోవడానికే.. టీవీకే అత్యంత వ్యూహాత్మకంగా సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సెంథిల్ బాలాజీని టార్గెట్ చేయడం వెనుక పొలిటికల్ ఈక్వేషన్స్!
విజయ్ ప్రభుత్వం డీఎంకేలో అందరినీ వదిలేసి కేవలం సెంథిల్ బాలాజీని, ఆయన సోదరుడిని మాత్రమే ఈ కేసులో టార్గెట్ చేయడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంగునాడు ప్రాంతంలో డీఎంకేకు సెంథిల్ బాలాజీ అత్యంత బలమైన వ్యూహకర్త, ఆర్థిక అంగబలం ఉన్న నేత. గతంలో ఈయన జైలుకు వెళ్లినప్పుడు కూడా డీఎంకే ఇబ్బందులు పడింది. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ టీమ్, ఆ ప్రాంతంలో తమ ఉనికిని చాటుకోవడానికి, డీఎంకేను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బతీయడానికి సెంథిల్ బాలాజీని ఒక సాఫ్ట్ టార్గెట్ గా ఎంచుకుందని, అందుకే ఐపీడీఎస్ సర్వే సంస్థ ప్రతినిధి తిరునావుక్కరసును వాడుకుని ఈ డ్రామా ఆడించారనేది డీఎంకే ఇస్తున్న లీక్.
ఒత్తిడిలో డీఎంకే
మొత్తానికి తమిళనాడులో హార్స్ ట్రేడింగ్ రాజకీయం ఒకరిపై ఒకరు బురదజల్లుకునే స్థాయికి చేరింది. ఒకవైపు ఆధారాలు ఉన్నాయంటూ టీవీకే ప్రభుత్వం అరెస్టులతో ముందుకు వెళ్తుంటే.. మరోవైపు అధికార బలంతో తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని డీఎంకే కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విపక్షాలను బలహీనపరచడం, లేదా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడం సహజమే అయినప్పటికీ.. కేవలం కొద్ది రోజుల వయసున్న విజయ్ ప్రభుత్వం , సుదీర్ఘ చరిత్ర ఉన్న డీఎంకేల మధ్య జరుగుతున్న ఈ నయా మైండ్ గేమ్ రాబోయే రోజుల్లో తమిళనాట మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.

