తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కీ రాధాన్ పండిట్ వెట్రివేల్ వల్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఈ జ్యోతిష్యుడు మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో చేస్తున్న వింత వ్యాఖ్యలు, చెబుతున్న జోస్యాలు సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురవుతుండటమే కాకుండా, విజయ్ ఇలాంటి వాడిని నమ్మారా అని సెటైర్లు వేస్తున్నారు.
విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధాన్ పండిట్‌ను ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ గా నియమించడం తమిళనాడులో పెద్ద రాజకీయ దుమారానికి దారితీసింది. ఒక జ్యోతిష్యుడిని అధికారిక పోస్టులో నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో దీంతో చేసేదేమీ లేక, నియమించిన 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది.
రాధాన్ పండిట్ మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల్లో విజయ్ జాతకాన్ని సునామీ తో పోల్చడం, టీవీకే పార్టీ పేరును తానే ఖరారు చేశానని చెప్పుకుంటున్నారు. ఆయన విజయ్‌ని కేవలం తమిళనాడు ముఖ్యమంత్రిగా మాత్రమే చూడటం లేదు. విజయ్ ఈ రాష్ట్రానికే కాదు, యావత్ ప్రపంచానికే దిక్సూచి అవుతారని ఆయన సెలవిచ్చారు. ముఖ్యంగా అమెరికా, రష్యా దేశాల మధ్య ఉన్న వివాదాలను, యుద్ధ మేఘాలను విడదీసే శక్తి ఒక్క విజయ్ జాతకానికే ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అంతర్జాతీయ సమస్యలను విజయ్ తన జాతక బలంతో పరిష్కరిస్తారని ఆయన చెప్పడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
విజయ్ మరో యాభై ఏళ్ల పాటు తిరుగులేని ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలిస్తారని రాధాన్ పండిట్ జోస్యం చెప్పారు. అక్కడితో ఆగకుండా, భవిష్యత్తులో విజయ్ దేశ ప్రధానమంత్రి కూడా అవుతారని, ఆయనను ఆపడం ఎవరి వల్లా కాదని ప్రకటించారు. ఆయననే కాదు ఆయనను నమ్ముతున్న విజయ్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జయలలిత మరణం గురించి ముందే చెప్పానని చెప్పుకుంటున్న పండిట్, తన పదవి 24 గంటల్లోనే ఊడిపోతుందని ఎందుకు గ్రహించలేకపోయారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

