తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దశాబ్దాల ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ ఆయన సాధించిన ఈ విజయం అసాధారణమైనది.
అయితే, ఈ చారిత్రాత్మక గెలుపును చూసి కోలీవుడ్ పెద్దలు మురిసిపోవడం వరకు బాగానే ఉన్నా, విజయ్‌ను తమ ఇండస్ట్రీ మనిషిగా భావిస్తూ దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటినీ ఆయన చిటికెలో పరిష్కరించేయాలంటూ అత్యాశ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వరుసగా డిమాండ్లు వినిపిస్తున్న సినీ పెద్దలు
ఒక ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల బాధ్యతలను చూడాలా, లేక సినీ పరిశ్రమ సమస్యలను తీర్చాలా అన్న ఆలోచన రాకుండా డిమాండ్లతో దండయాత్ర చేస్తున్నారు. విజయ్ సీఎం కాగానే కోలీవుడ్ నుంచి ఒత్తిళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. సీనియర్ నటుడు కమల్ హాసన్ పరిశ్రమ సమస్యలతో కూడిన ఒక పెద్ద చిట్టాను విజయ్ ముందుంచగా, నటుడు విశాల్ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు పెట్టారు. అటు రాఘవ లారెన్స్ కూడా అదే ధోరణిలో స్పందించారు. నిజానికి, సినిమా ఇండస్ట్రీలో ఉండే థియేటర్ల టికెట్ ధరలు, పైరసీ, ట్యాక్స్‌లు వంటి సమస్యలు రాత్రికి రాత్రే పరిష్కారమయ్యేవి కావు.
విజయ్‌ను అందరూ కలిసి విన్నవించుకోవచ్చుగా!
పరిశ్రమ పెద్దలంతా కలిసి ఒక అధికారిక సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రితో పద్ధతిగా చర్చిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇస్తూ డిమాండ్లు చేయడం కొత్తగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను ఇరకాటంలో పెట్టడమే అవుతుంది. కోలీవుడ్‌లో అంతర్గతంగా ఉండే ఈగోలు ఈ పరిణామంతో మరోసారి బయటపడ్డాయి. విజయ్ ఇంత పెద్ద విజయం సాధించి ముఖ్యమంత్రి అయినా, తమిళ చిత్రసీమలోని సగానికి పైగా ప్రముఖులు కనీసం ఆయనకు అధికారికంగా శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. పరిశ్రమలో ఉండే గ్రూపు రాజకీయాలు, ఈర్ష్యాద్వేషాల కారణంగానే కొందరు స్టార్ హీరోలు, దర్శకులు మౌనంగా ఉండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా మనసు రాని ఈగోలు, మరోవైపు తమ సమస్యలు తీర్చాలంటూ సోషల్ మీడియాలో పెట్టే డిమాండ్లకు అడ్డు రావడంలేదు.
విజయ్ .. ప్రజలకు సీఎం.. ఇండస్ట్రీకే కాదు!
ముఖ్యమంత్రి అయినంత మాత్రాన విజయ్ కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేరు. ఆయనకు ప్రభుత్వం నడపడం, కూటమి భాగస్వామ్యాలను సమన్వయం చేసుకోవడం, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటి ఎన్నో ప్రాధాన్యతలు ఉన్నాయి. ఇటువంటి సమయంలో సినీ పరిశ్రమ తన సొంత ప్రయోజనాల కోసం ఆయనపై ఒత్తిడి తీసుకురావడం ఇబ్బందికరమే. అందరూ కలిసికట్టుగా రానంత కాలం, ఈగోలను పక్కనపెట్టి ప్రభుత్వంతో పారదర్శకంగా వ్యవహరించనంత కాలం సినీ పరిశ్రమ సమస్యలు అలాగే ఉండిపోతాయి తప్ప, ఒకే ఒక్క వ్యక్తిపై భారం వేస్తే ఫలితం ఉండదని కోలీవుడ్ గ్రహించాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

