Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వి.సా.రెడ్డి వి బహిరంగ లేఖ -సజ్జలపై ఆటంబాంబ్ !

వి.సా.రెడ్డి వి బహిరంగ లేఖ -సజ్జలపై ఆటంబాంబ్ !

Telugu 360 3 weeks ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల వ్యవహారంపై విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ రెండు పేజీల సంచలన బహిరంగ లేఖను విడుదల చేశారు.

సోషల్ మీడియా వేదికగా తనపై నమ్మకద్రోహి అంటూ వైసీపీ కోటరీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను నమ్మకద్రోహినే అయితే నాడు సజ్జల రామకృష్ణారెడ్డి మాదిరిగా కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో పేరు లేకుండా చేసుకునేవాడినని, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నందుకే ఏ-2గా చేరి 15 నెలల పాటు జైలు జీవితం గడిపానని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో తనపై మద్యం స్కామ్, పోర్టు కేసుల్లో కేసులు పెట్టినా, జగన్‌కు వెన్నుపోటు పొడుస్తూ టీడీపీతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్న సజ్జల పేరు మాత్రం ఏ కేసుల్లోనూ లేకపోవడం ఆయన కుట్ర రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

బొత్సతో కలిసి కుట్రలు చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టారు!

పార్టీలో 2019 విజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం శ్రుతిమించి ఒక రాజ్యాంగేతర శక్తిగా అవతరించారని విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చివరకు పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్లకు సైతం జగన్ అపాయింట్‌మెంట్ దక్కకుండా సజ్జల గోడ కట్టారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి సీనియర్ రీజినల్ కోఆర్డినేటర్లందరినీ కాదని, సజ్జల పర్యవేక్షణలోనే పనిచేయాలంటూ ఆంక్షలు విధించడాన్ని తాను అంగీకరించలేకపోయానని తెలిపారు. పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న ఓ ఉత్తరాంధ్ర నాయకుడితో చేతులు కలిపి 2020 నుంచి జగన్‌కు తనపై చాడీలు చెప్పించి ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారని, ఢిల్లీలో పీఎంవో వ్యవహారాలు సహా పార్టీలో తన ప్రాధాన్యతను అంచలంచెలుగా తగ్గించి పొగబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జల దాడి చేసి కొట్టినా జగన్ మౌనంగా ఉన్నరు!

పార్టీలో తాను ఎదుర్కొన్న 74 అవమానాలను ఈ లేఖలో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. 2022 మంగళగిరి ప్లీనరీ సమావేశంలో సకల శాఖల మంత్రి నేరుగా తనపై భౌతిక దాడికి పాల్పడితే జగన్ ప్రేక్షకపాత్ర వహించారని సంచలన విషయం బయటపెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీల సమన్వయకర్తల సమావేశంలో సాయన్నకు వయసైపోయింది.. ముసలోడైపోయాడు అంటూ అనుబంధ సంఘాలు, గుంటూరు-తిరుపతి ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, కోర్ కమిటీ నుంచి కూడా తొలగించారని గుర్తుచేశారు. జగన్ దృష్టిలో తన మాటకు ఉన్న విలువే ఈ కోటరీ కడుపుమంటకు కారణమైందని, పార్టీలో ఉంటూ కోవర్టులుగా పనిచేస్తున్నది ఎవరో, నమ్మకద్రోహులు ఎవరో వైసీపీ శ్రేణులు , జగన్ అభిమానులు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.

ఇప్పుడు వైసీపీలో సజ్జలే నెంబర్ వన్

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నెంబర్ 2గా మారారని, సజ్జల రామకృష్ణారెడ్డి అసలైన నెంబర్ వన్ గా వ్యవహరిస్తున్నారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. సజ్జల ఆదేశాలకు తలొగ్గి, సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే తాను నాలుగేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. త్వరలోనే తాను సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తానని, ఎప్పటికీ వెన్నుపోటు లేదా కోవర్ట్ రాజకీయాలు చేయబోనని విజయసాయి రెడ్డి తన బహిరంగ లేఖలో కుండబద్దలు కొట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360