ప్రముఖ అంతర్జాతీయ ఐటీ, కన్సల్టింగ్ దిగ్గజం డెలాయిట్ ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నంలో తన సరికొత్త మెగా క్యాంపస్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెలాయిట్ యాజమాన్యం ఇప్పటికే విశాఖ నగరంలో పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రక్రియను ముగించిందని, త్వరలోనే అధికారికంగా కార్యకలాపాలను ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. వైజాగ్ ఐటీ కారిడార్ అయిన మధురవాడ ,రుషికొండ పరిసరాల్లో ఈ సరికొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ రూపుదిద్దుకోనుందని సమాచారం.
ఈ మెగా క్యాంపస్ ఏర్పాటుకు బలమైన సాక్ష్యంగా.. డెలాయిట్ సంస్థ తమ అంతర్గత ఉద్యోగులకు పంపినట్లుగా చెబుతున్న కొన్ని రీలోకేషన్ మెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియా, ఐటీ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్కీలతో పాటు, విశాఖకు మారాలనుకునే ఆసక్తి గల ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తూ ఈ మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ప్రారంభ దశలోనే సుమారు కొన్ని వేల మంది ఐటీ నిపుణులతో కార్యకలాపాలు ప్రారంభించాలనే వ్యూహంతో సంస్థ ఉన్నట్లు బిజినెస్ మీడియా విశ్లేషిస్తోంది.
గత కొద్దిరోజులుగా విశాఖపట్నంలో ఐటీ , డేటా సెంటర్ల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, మౌలిక సదుపాయాల కల్పన వంటి సానుకూల అంశాలే డెలాయిట్ వంటి అగ్రశ్రేణి సంస్థ వైజాగ్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ కావడం ప్లస్ పాయింట్ గా మారింది. డెలాయిట్ రాకతో వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ గ్లోబల్ మ్యాప్‌లో మరింత బలోపేతం కానుందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలు విశాఖ తీరానికి క్యూ కట్టడం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

