తెలుగు360 రేటింగ్ : 3.25/5
వరల్డ్ బిల్డింగులు, పాన్ ఇండియా గోలలో పడి, ఫ్యామిలీ ఎమోషన్స్ - అందులోని బలాల గురించి దర్శకులు, రచయితలూ మర్చిపోతున్నారేమో అనే భయం అప్పుడప్పుడూ వేస్తుంటుంది.
మాస్, యాక్షన్, హీరోయిజాలూ ఇవేం తప్పు కాదు. కానీ ప్రతీసారీ వీటినే నమ్ముకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న కంప్లైంట్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ వాళ్లని థియేటర్లకు రప్పించే కంటెంట్ ఇస్తున్నామా, లేదా? అని నిర్మాతలు కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేసుకొంటే - 'విశ్వనాథ్ అండ్ సన్స్' లాంటి సినిమాలు తప్పకుండా వస్తాయి. థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడ్ని రెండున్నర గంటలు కూర్చోబెట్టడానికి ప్రతీసారీ అద్భుతమైన కథలూ, మైమరపించే నేపథ్యాలే అవసరం లేదు. ఒక్కోసారి.. మూలాల్లోకి వెళ్తే సరిపోతుంది. విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం వెంకీ అట్లూరి అదే చేశాడు. చేతికి సూర్య లాంటి మాస్ హీరో దొరికినా - తన క్లాస్ టచ్ చూపించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ రంగరించాడు. మొత్తానికి ఓ క్లీన్ అండ్ గ్రీన్ సినిమా ప్రేక్షకులకు అందించాడు.
సంజయ్ విశ్వనాథ్ (సూర్య) మల్టీమిలియనీర్. గొప్ప బిజినెస్ మాన్. షూటింగ్ లో ఒలింపిక్ విన్నర్ కూడా. అమ్మ (రాధిక)ని అపురూపంగా చూసుకొంటాడు. డిసిప్లెన్ ఉన్న మనిషి. అయితే 42 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోడు. దానికీ ఓ కారణం ఉంటుంది. తల్లి మనసు మాత్రం సంజయ్ వారసత్వం ముందు తరాలకూ కొనసాగాలని కోరుకొంటుంది. అమ్మ బాధని అర్థం చేసుకొన్న సంజయ్.. పెళ్లి చేసుకోకుండా, సరోగసీ పద్ధతి ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లి చేతుల్లో పెడతాడు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఆ బిడ్డకు బోన్ నారో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే సరోగసీ ద్వారా ఆ బిడ్డకు జన్మనిచ్చిన మాగీ (మమితా బైజు)ని వెదికి పట్టుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి మాగి ఎవరు, తాను సంజయ్ విశ్వనాథ్ జీవితంలోని, అతని ఇంట్లోకి, ఆ ఇంట్లో ఉన్న మనుషుల జీవితాల్లోకి ఎలా ప్రవేశించింది, ఆ తరవాత ఎలాంటి కథ నడించింది? అనే విషయాలు తెరపై చూడాలి.
వినగానే 'వావ్' అనిపించే కొత్త పాయింటేం కాదు కానీ, కొత్తగా అనిపించే పాయింటే! ఈ కథలో రెండు కొత్త అంశాలున్నాయి. ఒకటి.. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్. రెండోది వాళ్లిద్దరూ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. ఈ రెండు పాయింట్లూ ఎంత కొత్తగా ఉన్నా, సినిమా కథా గమనంలో తొలి అరగంటకే ఈ విషయం ప్రేక్షకులకు అర్థమైపోతుంది. సో.. దర్శకుడు కొత్తగా అనుకొన్న పాయింట్ జీవిత కాలం ఆ అరగంటే. కానీ ఆ తరవాత కూడా సినిమాని నడిపించాలి. అలా చేయాలంటే ట్రీట్మెంట్ చాలా అవసరం. అది ఈ సినిమాకు బాగా కుదిరింది. దర్శకుడు సీన్లు రాసుకొన్న పద్ధతి, దాన్ని కన్వెన్సింగ్ గా తెరపై ఆవిష్కరించుకొన్న విధానం, అందులో నటీనటులు ఇమిడిపోయిన వైనం.. ఇవన్నీ బాగా నచ్చుతాయి. ప్రతీ సీనూ.. ఓ ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుంది. తొలి సీన్ నుంచే దర్శకుడు కథలోకి వెళ్లిపోయినా, అసలు జోష్ మాగీ రాకతోనే వస్తుంది. ఆ పాత్రని దర్శకుడు బాగా డిజైన్ చేసుకొన్నాడు.
మాగీ లాంటి పాత్రలు ఇది వరకు కొన్ని చూసే ఉంటాం. ప్రేమ సినిమాలో రేవతి (అందులో హీరోయిన్ పాత్ర కూడా మాగీనే) ఇంతే అల్లరిగా ఉంటుంది. బొమ్మరిల్లులో హాసిని పాత్ర కూడా ఇంతే ఆహ్లాదకరంగా డిజైన్ చేశారు. మళ్లీ ఆంత కాలానికి అలాంటి క్యారెక్టర్‌ని తెరపై చూసే అవకాశం దక్కింది. హీరో, హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఉండడం తో రాసుకొన్న సీన్లు కొత్తగా వచ్చాయి. వాళ్ల మధ్య కాన్వర్జేషన్స్ కొత్తగా అనిపించాయి. సూర్యలోని హుందాతనం, మమితలోని అల్లరి రెండూ బాగా మ్యాచ్ అయ్యాయి. దాంతో వాళ్లిద్దరి మధ్య తీసిన ప్రతీ సీన్ మెప్పించింది.
తొలి సగంలో… ఇంటర్వ్యూ సీన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. తండ్రి తాలుకూ గొప్పదనం చెప్పే సీన్లు చాలా వచ్చాయి. అయినా సరే, ఈ సినిమాలో చూపించిన విధానం బాగుంది. ఈ సీన్ జాగ్రత్తగా గమనిస్తే తండ్రి పాత్ర ఒక్క డైలాగ్ కూడా పలకదు. ప్రతీ ఎమోషన్ ఎక్స్‌ప్రెషన్స్, మిగిలిన పాత్రధారులు చెప్పే డైలాగులు, ఆ మూమెంట్సే ఆ సీన్ ని నిలబెట్టాయి. నిజానికి ఈ సీన్ లేకపోయినా కథ ఉంటుంది. కథకు అవసరం లేదు కూడా. కానీ…. అలా ఒక్క ఫ్రేములోనూ అనిపించదు. కండోమ్ సీన్ కూడా సెన్సిటీవ్. ఒక్కోసారి అలాంటి సీన్ల వల్ల సినిమా మొత్తం అభాసు పాలవుతుంది. దాన్ని డీల్ చేసిన పద్ధతిలో వెంకీ అట్లూరిలోని మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఆ సీన్ లో రాధిక ఎక్స్‌ప్రెషన్, హుందాతనం.. ఇవన్నీ ఆక్వర్డ్ ఫీలింగ్ ని దూరం చేసేశాయి. సెకండాఫ్‌లో.. రవీనా టాండన్ తల్లిదండ్రుల్ని సూర్య కన్వెన్స్ చేసే విధానం కూడా బాగుంది. తక్కువ సంభాషణల్లో, ఎక్కువ మెలో డ్రామాకి చోటు ఇవ్వకుండా బాగా రాసుకొన్నాడు వెంకీ అట్లూరి.
ఫస్టాఫ్ చూసేసరికి.. మంచి ఫీల్ వచ్చేస్తుంది. మమిత బైజు పాత్ర మైండ్ లో ముద్ర వేసుకొంటుంది. సెకండాఫ్ లో ఇదే ఫీల్ క్యారీ చేయడం చాలా కష్టం. ఆ ఇబ్బంది దర్శకుడూ పడ్డాడు. సడన్ గా సెకండాఫ్ లో హీరో రేసులోకి వచ్చి, మమిత క్యారెక్టర్ సైడ్ అయిపోతుంది. దాంతో మమిత ప్రాధాన్యత లేకుండా పోయిందేమిటి అనే ఫీలింగ్ వస్తుంది. ఊటీ సీన్లు కొంత మేర రక్తి కట్టడం, రాధిక క్యారెక్టర్ ఎమోషనల్ గా టర్న్ తీసుకోవడం వల్ల కొంత సేఫ్ అయ్యింది. క్లైమాక్స్ చాలా మామూలుగా అనిపిస్తుంది. అయితే.. ఈ కథని ఇంత సింపుల్ గా ముగించడమే బాగుంటుందేమో? మధ్యమధ్యలో సూర్య కోసం అన్నట్టుగా రెండు ఫైట్లు డిజైన్ చేశారు. అయితే అవి కూడా క్లాస్ టచ్‌తోనే ఉంటాయి.
సూర్య లుక్స్, తన స్టైలింగ్, తన పెర్‌ఫార్మెన్స్ అన్నీ బాగా కుదిరిన సినిమా ఇది. గజినీలో సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. సెకండాఫ్ లో తల్లి గదిలో కూర్చుని ఏడ్చే సీన్ లో సూర్య నటన మరింత గొప్పగా అనిపిస్తుంది. సూర్య లాంటి నటుడు ఉండడం వల్లే ఇలాంటి కథని దర్శకుడు అనుకొన్నది అనుకొన్నట్టు తీయగలిగాడు. సూర్యలో ఉండే హుందాతనం వల్ల ఆ పాత్ర మరింత పండింది. మమిత ఈ సినిమాకు సెంట్రాఫ్ ఎట్రాక్షన్. తన అల్లరి అందరికీ నచ్చేస్తుంది. ఫస్టాఫ్ అంతా తానే నడిపిస్తుంది. మమిత ఉన్న ప్రతీ సీన్ బాగా పండింది. ఆ పాత్రతో ప్రతి ఒక్కరూ లవ్ లో పడిపోతారు. అయితే ముందే చెప్పినట్టు ఆ పాత్రని సెకండాఫ్ హైడ్ చేయడం మాత్రం చాలామందికి నచ్చదు. కాకపోతే ఇది సూర్య సినిమా కాబట్టి, సూర్య పాత్ర కూడా ఎలివేట్ అవ్వాలి కాబట్టి, మమిత క్యారెక్టర్ ని తగ్గించాల్సివచ్చింది. రాధిక తన అనుభవాన్ని చూపించారు. అత్తయ్యా అనిపిలిచినప్పుడు చిన్న పిల్లలా సిగ్గు పడడం… తప్పకుండా రాధికలోని నటిని బయటకు తీసుకొస్తుంది. నాజర్ ఉన్నది కాసేపే. కానీ ఆకట్టుకొంటారు.
ఇది దర్శకుడి సినిమా. రచయితగానూ వెంకీ తన మార్క్ చూపించాడు. చాలా సంభాషణలు నోట్ చేసుకొనేంత బాగున్నాయి. త్రివిక్రమ్ శైలిని ఆయన బాగా పుణికి పుచ్చుకొన్నారు అనిపిస్తుంది. త్రివిక్రమ్ వదిలేసిన జోనర్‌ని ఆయన ఒడిసిపట్టుకొన్నారు. ఈ కథని త్రివిక్రమ్ డీల్ చేస్తే.. అచ్చం ఇలానే ఉంటుందనిపించేలా ఈ సినిమాని తీశారు. "డబ్బు కొనడం నేర్పిస్తుంది, కష్టం బతకడం నేర్పిస్తుంది", "కోపం, ద్వేషం కూడా కొంత కాలానికి అలసిపోతాయి.." లాంటి డైలాగులు మరింత బాగున్నాయి. ఇంటి సెట్ చాలా లావీష్ గా ఉంది. కాకపోతే ఓ థియేటర్ కట్టినట్టు కట్టారు. కలర్స్ కూడా ఏదోలా అనిపించింది. ప్రతీ సీన్ ఓ ఫైవ్ స్టార్ హోటెల్ లో తీసినట్టు అనిపిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలూ బాగున్నాయి. అమ్మ పాట గుర్తుంటుంది. క్వాలిటీ విషయంలో నిర్మాత నాగవంశీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. రైటింగ్ విషయంలో వెంకీ అట్లూరీ రాజీ పడలేదు. అందుకే ఓ క్లీన్ అండ్ గ్రీన్ సినిమా బయటకు రాగలిగింది. కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపు రావడానికి ఇలాంటి సినిమాలు దోహదపడతాయి. లెక్కలన్నీ కుదిరితే.. సూర్య కెరీర్ లో మరో మర్చిపోలేని సినిమా అవ్వడం మాత్రం ఖాయం.
తెలుగు360 రేటింగ్ : 3.25/5

