Monday, 28 May, 8.33 am ఇండియా హెరాల్డ్ గ్రూప్

ముఖ్యాంశాలు
మహానటి కధలో హాలివుడ్ ఛాయలు !

'మహానటి' మూవీకి దక్కిన ఊహించని సక్సస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత శుక్రువారం విడుదలైన 'నేలటిక్కెట్టు' 'ఆమ్మమ్మగారి ఇల్లు' ఈరెండు సినిమాలు నిరాశపరచడంతో నిన్నటితో ముగిసిన మరోవీకెండ్ లో కూడ ఎక్కడచూసినా 'మహానటి' మ్యానియానే కనిపించింది. ఈమూవీకి లెక్కకు మించి లభిస్తున్న ప్రశంసలు చూసి విమర్శకులు కూడ 'మహానటి' క్రేజ్ ఇంకా ఎన్ని వారలు కొనసాగుతుందో చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈమూవీ పై ఒక ఊహించని విమర్శ ప్రచారంలోకి వచ్చింది.

సావిత్రి జీవితం పై బయోపిక్ గా తీయబడ్డ ఈసినిమా స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక హాలీవుడ్ మూవీని పూర్తిగా కాపీకొట్టాడు అన్నకామెంట్స్ హడావిడి చేస్తున్నాయి. ఈమూవీలో సావిత్రి కథను డైరెక్ట్ గా చెప్పకుండా జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత చేసిన పరిశోధన ద్వారా రకరకాల పాత్రల చేత సావిత్రి కథను వెండితెర పై ప్రేక్షకులకు చూపించాడు నాగ్ అశ్విన్. సావిత్రి చివరిసారిగా రాసిన ఒక లెటర్‌తో మొదలైన ఈమూవీ కథలో 'శంకరయ్య' అనే ఊహాజనితమైన పాత్ర ఎంటర్ అవుతుంది. అయితే 'మహానటి' మూవీ చివరి వరకు ఈశంకరయ్య ప్రస్తావన కొనసాగుతూనే ఉంటుంది కాని ఆశంకరయ్య ఎవరో ప్రేక్షకులకు తెలియకుండానే 'మహానటి' ని ముగించారు.

అయితే నాగ్ అశ్విన్ 'మహానటి' మూవీలో ఉపయోగించిన ఈశంకరయ్య సస్పెన్స్ కు ప్రముఖ హాలీవుడ్ మూవీ 'సిటిజన్‌ కేన్‌' ప్రభావం అని అంటున్నారు. హాలీవుడ్ మూవీలలో సూపర్ హిట్ కావడమే కాకుండా క్లాసిక్‌ మూవీగా ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన 'సిటిజన్ కేన్' లో అనుసరించిన సస్పెన్స్ ను 'మహానటి' మూవీలో కూడ యథాతధంగా కాపీ చేసారు అని విమర్శకుల వాదన. ఒక కల్పిత పాత్ర జీవితాన్ని బయోపిక్‌ గా మార్చి తీసిన మూవీ 'సిటిజెన్ కేన్' ఈమూవీలో తనజీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మరణించే ముందు 'రోజ్‌ బడ్‌' అంటూ కలవరిస్తూ మరణిస్తాడు.

ఆ వ్యాపారవేత్త అన్నమాటలు రికార్డ్ చేసిన డాక్టర్ల మాటలను ఆధారంగా చేసుకుని ఇంతకీ రోజ్‌ బడ్‌ ఏమిటి? అంటూ మీడియా పరిశోధన ప్రారంభిస్తుంది. ఆపరిశోధనతో అతడి జీవిత కథ అంతా బయటకు వస్తుంది. చివరకు ఈమూవీలో 'రోజ్‌ బడ్‌' అంటే ఏమిటో ఆపేరును ఆవ్యాపారవేత్త ఎందుకు కలవరించాడో తెలియకుండానే ఆమూవీ ముగింపుకు వస్తుంది. 'రోజ్ బడ్' అంటే ఆ ప్రముఖ వ్యాపారవేత్త రహస్య ప్రేమికురాలా లేదంటే అతడి అజ్ఞాత కూతురా లేకుంటే ఈ 'రోజ్ బడ్' వెనుక ఏదైనా మర్డర్ మిస్టరీ ఉందా అన్న సస్పెన్స్ తో కథ చాల స్పీడ్ గా నడుస్తుంది. అదే టెక్నిక్ 'మహానటి' మూవీకి కూడ వాడి నాగ్ అశ్విన్ సావిత్రి జీవితంలో ఎక్కడా లేని శంకరయ్య పాత్రను సృష్టించాడు అంటూ కొందరు సినీ విమర్శకులు 'మహానటి' మూవీ కాపీ సినిమానే అంటూ కొత్త వార్తలను తెర పైకి తీసుకువస్తున్నారు..

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Ap Herald
Top