ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన 'రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం' బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు.
2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పు కాదని, అది అధికార అహంకారానికి ప్రజలు నేర్పిన గుణపాఠమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని స్పష్టం చేస్తూ, ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదని, రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి దిశగా నడిపించే బాధ్యత అని అన్నారు.
రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పు ఆంధ్రప్రదేశ్ సమాజానికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని అందించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. భయం, అహంకారం, అధికారమే అన్న భావజాలాన్ని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య విలువలకు మద్దతు పలికారని అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఓటరు, రైతు, నాయకుడు, కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కూటమిలోని ఏ ఒక్క పార్టీదో కాదని, ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, జనసేన పార్టీ సంకల్పం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి బలమైన పునాది వేశాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన 21 స్థానాలకు పరిమితమైన నిర్ణయం తీసుకుందని, ప్రజలు 100 శాతం స్ట్రైక్ రేట్‌తో ఆ నిర్ణయానికి మద్దతు తెలిపారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, విద్య మరియు ఉపాధి రంగాలకు ప్రాధాన్యత వంటి కార్యక్రమాలు అందులో భాగమని చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామ స్వరాజ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన స్థానిక స్వపరిపాలన, దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతాల సమాహారమే ప్రధాని మోదీ పాలనా తత్వమని అన్నారు. దేశ భవిష్యత్తు గ్రామాల్లోనే నిర్ణయించబడుతుందని, ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా ఉండేది గ్రామ పరిపాలనా వ్యవస్థేనని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలను బలహీనపరిచి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో వందలాది మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటారని, వారే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని చెప్పారు. వ్యవస్థలపై ప్రజల విశ్వాసం తగ్గితే కులం, ప్రాంతీయత, విభజన భావాలు పెరుగుతాయని హెచ్చరించారు. రెండేళ్లలో తాము నిర్మించడానికి ప్రయత్నించింది కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదని, ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకాన్ని పునరుద్ధరించడమే ముఖ్య ఉద్దేశమని వివరించారు.
తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే కుల, ప్రాంతీయ పరిమితులను దాటి భారతీయత వైపు అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, సామాజిక సమతుల్యత, జాతీయ సమైక్యత, పరస్పర విశ్వాసం వంటి విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పంచాయతీల్లో బ్లీచింగ్ కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని, విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. రాజ్యాంగం పంచాయతీలకు హోదా ఇచ్చినా, నిధులు, అధికారాలు, బాధ్యతలు పూర్తిస్థాయిలో గ్రామ స్థాయికి చేరలేదని చెప్పారు.
గ్రామ సమస్యలకు గ్రామాల్లోనే పరిష్కారం దొరకాలని, అందుకే గ్రామసభలను ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా మార్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామానికి అవసరమైన రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, గృహాల వంటి అంశాలపై నిర్ణయాలు కార్యాలయాల్లో కాకుండా గ్రామసభల్లోనే తీసుకోవాలని అన్నారు. గ్రామసభ బలపడితే సర్పంచ్ బలపడతారని, సర్పంచ్ బలపడితే పంచాయతీ బలపడుతుందని, పంచాయతీ బలపడితే ప్రజాస్వామ్యం మరింత పటిష్టమవుతుందని చెప్పారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను నాయకత్వాన్ని తీర్చిదిద్దే ప్రజాస్వామ్య పాఠశాలగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల నుంచి నాయకత్వం వెలుగులోకి రావడానికి ఇది కీలక వేదికగా మారిందన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్థానిక సంస్థల నుంచే తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లామని తెలిపారు. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, పల్లెపండుగ వంటి కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చడం జరిగిందన్నారు.
స్వర్ణ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీనివాసపురం పంచాయతీలో ఆస్తుల నమోదును డిజిటల్ విధానంలో నవీకరించడంతో పంచాయతీ ఆదాయం రూ.75 లక్షల నుంచి రూ.1.66 కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా వ్యవస్థలను సక్రమంగా నిర్వహించడం ద్వారా ఈ ఫలితం సాధ్యమైందన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంట్ భవనం నుంచి కాకుండా గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, ప్రజాస్వామ్యం బలపడితేనే దేశం బలపడుతుందని అన్నారు. వచ్చే ఎన్నికల కోసం కాకుండా రాబోయే తరాల భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ తరాలు గర్వించే సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

