Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
50% గ్రీన్ కవర్ లక్ష్యం.. అటవీ అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

50% గ్రీన్ కవర్ లక్ష్యం.. అటవీ అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

TeluguBulletin.com 2 weeks ago

Pawan Kalyan రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, గ్రేట్ గ్రీన్ వాల్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిర్దేశించిన టైమ్ ఫ్రేమ్ ప్రకారం అధికారులు బాధ్యతగా పనిచేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ, పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రపంచంలోనే శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే విలువైన ఎర్రచందనం భారీగా విదేశాలకు అక్రమంగా తరలిపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడంపై ఏ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయో వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెంపు కోసం వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

పర్యావరణ పరిరక్షణలో వ్యక్తుల కృషి ఎంత గొప్ప ఫలితాలు ఇస్తుందో వనజీవి రామయ్య, దుశ్శర్ల సత్యనారాయణ వంటి వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వారు ఒంటరిగా హరిత విప్లవాన్ని సృష్టించినప్పుడు, మొత్తం వ్యవస్థగా అటవీ శాఖ ఇంకా ఎంత పెద్ద స్థాయిలో పనిచేయగలదో ఆలోచించాలని సూచించారు. పచ్చని భవిష్యత్తు కోసం అందరూ కలిసి నిజమైన సంకల్పంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన సూచించారు. వర్షాకాలం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, జూన్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతుల తయారీ, పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వాలంటీర్లు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.

అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎంత భూమి ఆక్రమణకు గురైంది, ఎంత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారనే వివరాలను అటవీ శాఖ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో ఆక్రమిత అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

మొక్కలు నాటడమే కాకుండా వాటిని మహావృక్షాలుగా పెంచే వరకు సంరక్షించడం కూడా బాధ్యతేనని పవన్ కళ్యాణ్ అన్నారు. ఫోటోలు, రికార్డుల కోసం కాకుండా నిజమైన నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 50 శాతం పచ్చదనం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి మొక్కను ప్రాణంలా కాపాడుకోవాలని చెప్పారు.

అటవీ శాఖ పనితీరుపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ శాఖ చేపడుతున్న పర్యావరణ కార్యక్రమాలు, అటవీ సంరక్షణ చర్యలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin