Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ రెండూ పూర్తి చేయగలిగితే, ఏపీలో కూటమికి తిరుగు లేదంతే.!

ఆ రెండూ పూర్తి చేయగలిగితే, ఏపీలో కూటమికి తిరుగు లేదంతే.!

TeluguBulletin.com 3 months ago

భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తయ్యింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగ్గా, మరో పదిహేను రోజుల్లోనే ఈ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

ఉత్తరాంధ్ర అబివృద్ధికి ఈ గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ముఖద్వారంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. యావత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ఈ అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ముఖద్వారం అవుతుందనేవారూ లేకపోలేదు.

2026లో చోటు చేసుకున్న అద్భుతంగా ఈ విమానాశ్రయాన్ని అభివర్ణించొచ్చేమో. టైమ్ లైన్‌లో ఇంకో ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరింది, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటన ద్వారా. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రకటించిన ఆ ప్రాజెక్ట్, ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి పోలవరం.

2027లో పోలవరం ప్రాజెక్టుని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి, 2018 చివరి నాటికే పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు ఇది. అనేకానేక వివాదాల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోంది.

వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుని అయోమయంలో పడేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్టు పనులూ జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినట్లు 2027లో పోలవరం ప్రాజెక్టుని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయగలిగితే, అది అద్భుతమే.

ముచ్చటగా మూడోది.. రాజధాని అమరావతి. ఇది రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. 2028 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా తొలి దశ పూర్తి చేసి, జాతికి అంకితమిస్తామని చంద్రబాబు, భోగాపురంనుంచే ప్రకటించిన విషయం విదితమే.

ప్రస్తుతం అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు చాలా చాలా వేగంగా జరుగుతున్నాయి. అధికారిక భవనాల నిర్మాణం జోరందుకుంది. ప్రతి నెలా పనుల్లో పురోగతిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షిస్తూనే వున్నారు. అమరావతి ప్రజలకు ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా.

ఇంకో ఏడాదిలో భోగాపురం విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి అత్యద్భుతంగా కనిపించబోతోంది. పోలవరం ప్రాజెక్టు చుట్టూ జరగబోయే అభివృద్ధి అంచనాలకు అందదు. అమరావతి సంగతి సరే సరి. మొత్తమ్మీద, 2029 ఎన్నికల్లో కూటమికి 'తిరుగుండదు' అన్నమాట. అది జరగాలంటే, పోలవరం అలానే అమరావతి.. చంద్రబాబు టైమ్ లైన్ ప్రకారమే పూర్తవ్వాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin