Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాలో వెంకటేశ్.. మాటలతో చమత్కారం చేసే త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి పెంచేలా జూలై 27న సినిమాలో పాత్రలకు, సినిమాకు సంబంధించిన థీమ్ ను రివీల్ చేయనుంది. సినిమాలో నటిస్తున్న నటులు ఏయే పాత్రల్లో కనిపించనున్నారో తెలియజేయనుంది. వెంకటేశ్.. 'చిట్టిబాబు' పాత్రలో కనిపిస్తూండగా.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. 'స్వర్ణ'గా కనిపించబోతున్నారు. సంపూర్ణగా యువిన పార్వతి, శర్వాగా రాజ్ ప్రజ్వల్ నటిస్తున్నారు. మిగిలిన పాత్రలనూ అదే రోజు పరిచయం చేయనున్నారు. ఇద్దరు పిల్లల తండ్రిగా.. మధ్యతరగతి కుటుంబం పెద్దగా వెంకటేశ్ కనిపించనున్నారు.
ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కుతున్న సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నాగవంశీ సమర్పణలో సినిమా తెరకెక్కుతోంది. వెంకటేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా ఇది. గతంలో వెంకటేశ్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు కథా రచయితగా పని చేశారు త్రివిక్రమ్. పూర్తిస్థాయిలో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

