ముంబైలో జరిగిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా కాన్ఫరెన్స్-2026లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి దిశ, పెట్టుబడుల ఆకర్షణ, డేటా సెంటర్లు, ఉద్యోగాల సృష్టి, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా మాట్లాడారు.
"ఫ్యూచర్ రెడీయింగ్ ఇండియా - ది ఆంధ్ర ఎక్స్‌పీరియెన్స్" అంశంపై జరిగిన ఫైర్‌సైడ్ చాట్‌లో పాల్గొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలవడానికి మూడు ప్రధాన కారణాలను వివరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, వేగవంతమైన నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం రాష్ట్ర విజయానికి కీలకమని లోకేష్ చెప్పారు. నగరాల నిర్మాణం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, కొత్త ఎకోసిస్టమ్‌ల అభివృద్ధిలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి బలంగా మారిందన్నారు.
పెట్టుబడులను ఆకర్షించడంలో "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు, ఆర్సెలార్ మిట్టల్ భారీ ప్రాజెక్ట్‌కు తక్కువ సమయంలో అనుమతులు ఇవ్వడం వంటి ఉదాహరణలు రాష్ట్ర సామర్థ్యాన్ని చాటుతున్నాయని చెప్పారు. కేంద్రం సహకారంతో పన్ను విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకువచ్చి డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షించగలిగామని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఏఐ, డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో డిజిటల్ హబ్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. విశాఖలో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఉండటం వల్ల భవిష్యత్తులో ఏఐ, ఐటీ రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు.
డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. గోదావరి నది ద్వారా ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుండగా, ప్రతిపాదిత డేటా సెంటర్లకు చాలా తక్కువ నీరే అవసరమవుతుందని వివరించారు. థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే డేటా సెంటర్ల నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని, ఈ విషయంపై ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్ద కంపెనీలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సమానంగా కీలకమని లోకేష్ చెప్పారు. ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించేది ఎంఎస్ఎంఈ రంగమేనని, అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి ప్రజల విశ్వాసం అత్యంత ముఖ్యమని లోకేష్ పేర్కొన్నారు. భూసేకరణ సమయంలో స్థానిక ప్రజలకు పారదర్శకత, సరైన పరిహారం, ఉద్యోగ అవకాశాలపై హామీలు ఇవ్వడం వల్లే పెద్ద ప్రాజెక్టులు సాఫీగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
విద్యా వ్యవస్థను కూడా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీ వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యోగాలు వెతికే యువత మాత్రమే కాకుండా, ఉద్యోగాలు కల్పించే యువతను తయారు చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ వెల్లడించారు. డేటా సెంటర్లు, ఫార్మా, మెడికల్ డివైసెస్, డిఫెన్స్, స్పేస్, క్వాంటం కంప్యూటింగ్, గ్లాస్ పరిశ్రమలు వంటి రంగాల్లో ప్రత్యేక క్లస్టర్ల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని ఒకే నగరానికి పరిమితం చేయకుండా మూడు ఎకనామిక్ రీజియన్లుగా విస్తరించే ప్రణాళికపై కూడా లోకేష్ వివరించారు. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని పరిశ్రమలు, తయారీ రంగాలు, సేవా రంగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయని లోకేష్ తెలిపారు. విద్య, వైద్యం, హాస్పిటాలిటీ, క్వాంటం కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్ వంటి రంగాలకు కేంద్రంగా అమరావతి ఎదగబోతోందన్నారు. 2028 నాటికి ప్రభుత్వ కోర్ మౌలిక సదుపాయాలను పూర్తి చేసి దేశానికి అంకితం చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువత, మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

