Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతికి మరో మెగా విద్యా సంస్థ.. దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్శిటీ

అమరావతికి మరో మెగా విద్యా సంస్థ.. దేశంలోనే తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్శిటీ

TeluguBulletin.com 3 weeks ago

రాజధాని అమరావతిని జాతీయ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు పడింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (NIELIT) నేతృత్వంలో దేశంలోనే తొలి క్వాంటమ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్శిటీ అమరావతిలో ఏర్పాటు కానుంది.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఆర్డీఏ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కేటాయించిన 8.5 ఎకరాల విస్తీర్ణంలో రూ.730.70 కోట్ల అంచనా వ్యయంతో ఈ యూనివర్శిటీ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం 100 శాతం గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో సమకూర్చనుంది.

క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ డిజైన్, చిప్ ఫ్యాబ్రికేషన్, డేటా సైన్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించే విధంగా ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లోని రోపర్‌లో ప్రధాన క్యాంపస్‌తో పనిచేస్తున్న నైలిట్, దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్‌వర్క్‌ను విస్తరించుతూ అమరావతిలో ప్రపంచ స్థాయి డీప్-టెక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.

శాశ్వత క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యా కార్యక్రమాలు ఆలస్యం కాకుండా వచ్చే నెల 13 నుంచి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU)లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించనున్నారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ, డిప్లొమా, ఎగ్జిక్యూటివ్ కోర్సులతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, AI-మెషిన్ లెర్నింగ్, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెమీకండక్టర్ టెక్నాలజీ వంటి అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అమరావతి క్యాంపస్‌లో ప్రధాన ఆకర్షణగా 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటమ్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ బ్లాక్ (QRIIB) నిర్మించనున్నారు. ఇందులో క్వాంటమ్ ఫోటోనిక్స్, క్రియోజెనిక్ సిస్టమ్స్, క్లీన్‌రూమ్-నానో ఫ్యాబ్రికేషన్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, స్టార్టప్ కో-వర్కింగ్ స్పేస్‌లు, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, పేటెంట్ సెల్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉండనున్నాయి.

ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఐదేళ్లలో 8,250 మందికి శిక్షణ అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. అందులో 1,650 మంది డిగ్రీ, పీజీ కోర్సుల ద్వారా, మరో 6,600 మంది వివిధ స్కిల్ సర్టిఫికేషన్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందనున్నారు. సౌర విద్యుత్, ఈవీ ఛార్జింగ్, నెట్-జీరో కాన్సెప్ట్‌తో పర్యావరణహిత క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. 500 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యంతో పాటు ఆడిటోరియం, క్రీడా ప్రాంగణాలు, గెస్ట్ హౌస్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు.

నేషనల్ క్వాంటమ్ మిషన్, ఇండియా AI మిషన్, ఇండియా సెమీకండక్టర్ మిషన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, జేఎన్‌టీయూ వంటి ప్రముఖ విద్యాసంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. ఈ సంస్థ ఏర్పాటుతో అమరావతి దేశంలోనే ప్రముఖ డీప్-టెక్, ఇన్నోవేషన్ కేంద్రంగా ఎదగడంతో పాటు రాష్ట్ర యువతకు ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin